Delhi Liquor Scam Case: హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను వేగవంతం చేసింది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీచేసింది. జనవరి 16న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. అయితే ఈడీ విచారణకు మంగళవారం (జనవరి 16న) హాజరు కావడం లేదంటూ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఈడీకి లేఖ రాశారు. ఈ మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు కవిత ముందస్తుగా సమాచారం ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉందని ఈడీకి ఆమె గుర్తుచేశారు.


ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు 
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)ను ఈడీ మరోసారి విచారించనుంది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కూతూరు, ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం (జనవరి 16)న విచారణకు రావాలని కవితకు జారీ చేసిన నోటీసులలో ఈడీ పేర్కొంది.


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మెడకు చిక్కుకున్న ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ పలుమార్లు విచారించింది. తెలంగాణ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేస్తారని సైతం ప్రచారం జరిగింది. కానీ విచారణలో భాగంగా కవిత ఈడీ అధికారులకు సహకరించి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈడీ ఆదేశాల మేరకు ఆమె వినియోగించిన ఫోన్లు, ఇతర పరికరాలు సైతం సబ్మిట్ చేయడం తెలిసిందే. చాలా రోజుల విరామం తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజురు కావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సైతం ఈ కేసులో ఈడీ నాలుగోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 18న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది.


గత మార్చి నెల నుంచి లిక్కర్ కేసులో కవిత విచారణ
గత మార్చి నెలలో ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత ఈడీ విచారణకు పలుసార్లు హాజరైంది. ఈడీ ఆఫీసులో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ అప్పటి నుంచి కవిత చెబుతూ వస్తున్నారు. దీనిపై అప్పుడే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే ఈడీ తనను విచారణ చేయాలని కవిత కోరుతున్నారు. ఈ క్రమంలో ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మళ్లీ ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులు జారీ అవడంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఆప్, వైసీపీ నేతలతో పాటు కవిత ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు.


Also Read: మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ - మెసేజ్ లకు రిప్లై ఇవ్వొద్దని విజ్ఞప్తి