Kalvakuntla Kavitha: సమగ్ర సర్వే సరిగ్గా జరగలేదు, అన్నీ కాకి లెక్కలే - తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
BRS MLC Kavitha : కులగణన సర్వే సరిగ్గా జరలేదని, తమ ఇళ్లకు సర్వే కోసం రాలేదని చాలా మంది అంటున్నారని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. అన్నీ కాకిలెక్కలేనని ఆరోపించారు.
BRS MLC Kalvakuntla Kavitha : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికకు సంబంధించిన ముఖ్యాంశాలను మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కులగణన సర్వేపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ కులగణన (Caste Census)పై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా తన నివాసంలో బీసీ, తెలంగాణ జాగృతి నేతలతో సమావేశమైన కవిత.. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపును సాధించుకోవడం, అందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
బీసీలంటే ఎందుకంత చిన్నచూపు..?
అసెంబ్లీలో లఘు చర్చతో ఏం లాభం ఉండదని కవిత అన్నారు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించారు. “మేమెంతుంటే... మాకంత వాటా” అని చెప్పే రాహుల్ గాంధీ.. దాని ప్రకారం 46.3 శాతం బీసీలు, 10 శాతం బీసీ ముస్లీంలు.. మొత్తం కలిపి 56 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ.. బీసీల విషయంలో మాత్రం ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలనన్నారు. తక్షణమే రిజర్వేషన్లను పెంచాలని, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు.
ఇది కరెక్టేనా రేవంత్ రెడ్డి..?
సర్వే సరిగ్గా జరలేదని ప్రతి ఒక్కరి మనసుల్లో ఉందని, తమ ఇళ్లకు సర్వే కోసం రాలేదని ప్రతీ గ్రామంలో చాలా మంది అంటున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలింది. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.03 కోట్ల ఇళ్లు, 3 కోట్ల 68 లక్షల జనాభా అని తేలింది. అప్పడు నాలుగేళ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇళ్ళు పెరిగాయి. 2014-2024 వరకు పదేళ్ళలో ఎన్ని ఇళ్ళు ఎంత జనాభా ఉండాలి? ఎన్ని కుటుంబాలు పెరగాలి ? కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల గణనలో కోటి 15 లక్షల ఇళ్లు ఉన్నాయని చెబుతోంది. జనాభా 3.70 కోట్లు అని చెప్తుంది. 2011 -14 వరకు 20 లక్షల ఇల్లు పెరిగితే... 2014 నుంచి పదేళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలి. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2శాతం ఉన్నట్లు తేల్చడం బాధాకరం. ఇది కరెక్టా అని సీఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేయి చేసుకుని చెప్పాలని కవిత వ్యాఖ్యానించారు. ఈ కాకి లెక్కలతో అయినా బీసీల రిజర్వేషన్ల పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్న్నారు.
పరిశీలనకు 15 రోజుల సమయం ఇవ్వాల్సిందే
సకల జనుల సర్వేకు, ఇప్పటి ఈ సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తోందని, సకల జనుల సర్వేలో ఓసీల జనాభా చాలా తక్కవ తేలింది... ఈ సర్వేలో చాలా ఎక్కువ కనిపిస్తోంది.. దీని వెనుక మతలాబు ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గుతుందా ? అని ప్రశ్నించారు. బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సర్వే డేటాను సమీక్షకు పెట్టాలని, 3.5 కోట్ల సర్వే పత్రాలను ప్రజల స్క్రూటినికీ అందుబాటులోకి పెట్టాలని కోరారు. ఈ పరిశీలనకు15 రోజుల సమయం ఇవ్వాలన్నారు. కేవలం చిన్న చర్చ పెట్టి ఏం లాభమన్నారు. బీసీ, ఎస్సీ వర్గీకరణ అంశంలో రాజకీయాలు తగదని సూచించారు.
Also Read : Telangana MLAs: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, విచారణ ఈ 10కి వాయిదా