Supreme Cout Notices To MLAs: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే.
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని వేసిన మొదటి పిటిషన్‌తో పాటు రెండో పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణతో పాటు రెండో పిటిషన్‌పై విచారణ చేస్తామని తాజా పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
తెలంగాణలో ఉప ఎన్నిలకు రెడీ: కేటీఆర్పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ లోకి ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యమని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇక ఎమ్మెల్యేలుగా కొనసాగడం కుదరదని, త్వరలోనే వారిపై వేటు పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.