BRS Leaders Went To Nalgonda Meeting: తెలంగాణలో జల జగడం ముదురుతోంది. ఓ వైపు మేడిగడ్డ సందర్శనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బయలుదేరగా.. మరోవైపు తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి కాంగ్రెస్ పార్టీ దాసోహమైందని ఆరోపిస్తూ నల్గొండలో తలపెట్టిన బహిరంగ సభకు బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. తెలంగాణ భవన్ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో 'ఛలో నల్గొండ' భారీ బహిరంగ సభకు మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (HarishRao), పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు బయలుదేరారు. 


ప్రభుత్వంపై కడియం విమర్శలు



ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) విమర్శలు గుప్పించారు. 'ఈరోజు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు అంతా నల్గొండ బహిరంగ సభకు బయలుదేరి వెళ్తున్నాం. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ గోదావరి నదీ జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పింది. రాష్ట్ర రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మా పార్టీ వివరంగా గళం ఎత్తింది. నదీ జలాల పరిరక్షణ కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఈ సభ నిర్వహిస్తున్నాం. సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసింది. బీఆర్ఎస్ బహిరంగ సభకు భయపడి సర్కారు తోకముడిచింది. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. నేటి బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నదీ జలాలపైన, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాలపై సభలో ప్రజలకు వివరిస్తారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోం. ఈ జల ఉద్యమం తొలి అడుగు మాత్రమే. భవిష్యత్తుల్లో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తాం.' అని కడియం పేర్కొన్నారు.


'కాళేశ్వరం అంటే మేడిగడ్డే కాదు'


కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు. మంగళవారం శాసనసభలో ప్రభుత్వం సభా సంప్రదాయాలు ఉల్లంఘించిందని మండిపడ్డారు. శాసనసభ సమావేశాల అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 'మేడిగడ్డ పర్యటన ద్వారా ప్రభుత్వం మాపై బురద చల్లేందుకు యత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన ప్రజలను అడగాలి. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్ లు, 203 కి.మీల సొరంగాలు, 1,531 కి.మీల గ్రావిటీ కెనాల్, 98 కి.మీల ప్రెజర్ మెయిన్స్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం కలగిసిన సమూహం. ఒక్క బ్యారేజీలో ఒకటి రెండు కుంగిపోతే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. కాళేశ్వరం ఫలితాల గురించి రైతులను అడగాలి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని తాము నిద్ర లేపితే ప్రభుత్వం లేచింది. సర్కారు నీతిని ప్రజలంతా గమనిస్తున్నారు.' అని హరీష్ మండిపడ్డారు.


Also Read: CM Revanth Reddy: మేడిగడ్డ బయలుదేరిన సీఎం రేవంత్ బృందం - పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు