CM Revanth Reddy And Group Medigadda Visit: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ (Medigadda) సందర్శనకు బయలుదేరారు. మంగళవారం అసెంబ్లీలో కాసేపు మాట్లాడిన అనంతరం.. మంత్రి శ్రీధర్ బాబు (Sridharbabu) సభ్యులందరినీ ప్రాజెక్టు సందర్శనకు ఆహ్వానించారు. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బస్సుల్లో ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించనున్నారు. కాగా, మేడిగడ్డ టూర్ కు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఎంఐఎంకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం వెంట బృందంలో ఉన్నారు.


పటిష్ట భద్రత


సీఎం బృందం పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ పోలీసులు, అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, అధిక సంఖ్యలో సీఐలు, ఎస్సైలు సుమారు 800 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ లోని పియర్స్ ను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో.. అక్కడకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అక్కడ నదీ గర్భం నుంచి నీరు పైకి వస్తుండడంతో మోటార్లతో ఎత్తిపోశారు. బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు 3 వేల మంది కూర్చోవడానికి వీలుగా సభా స్థలి ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు. అనంతరం, సాయంత్రం మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడతారు. అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి తిరుగు పయనమై రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.


కాగా, గత కృష్ణా నదీ జలాల అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య గత 2 రోజులుగా తీవ్ర వాదోపవాదాలు సాగాయి. సోమవారం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులకు మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. తన ఒత్తిడి వల్లే ఈ తీర్మానం ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొనగా.. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఉదాసీనత వల్లే జల దోపిడీ జరిగిందని మంత్రులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తేల్చేందుకే మేడిగడ్డకు వెళ్తున్నామని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రావాలని అధికార సభ్యులు తెలిపారు. మరోవైపు, బీఆర్ఎస్ సైతం మంగళవారం తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్గొండ సభకు బయలుదేరారు. అటు అధికార బృందం మేడిగడ్డ సందర్శన, ఇటు ప్రతిపక్ష సభ్యుల నల్గొండ సభతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది.


Also Read: CM Revanth Reddy: 'కాళేశ్వర్ రావు గారి కోసం హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంది' - ఇసుకలో పేక మేడలు కట్టారా అంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు