CM Revanth Comments in Telangana Assembly on Medigadda Visit: కృష్ణా నదీ జలాల సందర్శనకు సంబంధించి ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం బృందం వెళ్లనున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో స్వల్ప కాలిక చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. 'సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు. ప్రాజెక్ట్ రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారు. సాగునీటి ప్రాజెక్టులపై సోమవారం చర్చించి వాస్తవాలు చెప్పాం. అప్పట్లో ప్రాజెక్టుల వద్దకు ఎవరినీ వెళ్లకుండా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. తెలంగాణ సస్య శ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.38,500 కోట్లతో 2008లో టెండర్లు పిలిచింది. రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలను రూ.1.47 లక్షల కోట్లకు పెంచింది. ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారు. వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా?. ఇండియా - పాకిస్థాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు. ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు. కొంతమంది అధికారులు ఫైళ్లు మాయం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టగా.. పూర్తి నివేదిక వచ్చింది. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉంది. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాలి. అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దాం.' అని సీఎం తెలిపారు.



'అదే మా ఉద్దేశం'


బీఆర్ఎస్ హయాంలో తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఇలా బ్యారేజీలు కట్టుకుంటూ పోయారని సీఎం రేవంత్ అన్నారు. చివరకు ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలు సైతం పెంచేశారని మండిపడ్డారు. 'అసలు ప్రాజెక్టుల అంచనాలు ఎలా పెంచారు.?. రీడిజైనింగ్ ఎలా చేశారు.? నిపుణులు ఇచ్చిన డీపీఆర్ ఎక్కడ? ఆ తర్వాత నిర్మాణం, నిర్వహణ అన్నీ ప్రశ్నలే!. ఇప్పటికీ బ్యారేజీ వద్ద ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కొంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ వారికి పూర్తి అవగాహన ఉందో లేదో తెలియదు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ బ్యారేజీ సందర్శనకు రావాలని కోరాం. అదే జరిగితే అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రతి ఒక్కరికీ తెలుస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని.. వారి ఇళ్లల్లో కనకవర్షం కురిసిందని మేం అనడం లేదు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అదొక్కటే మా ఉద్దేశం. ప్రాజెక్టుల వద్ద వాస్తవ పరిస్థితులను పరిశీలించి రెండు, మూడు రోజుల్లో శ్వేత పత్రం విడుదల చేస్తాం.' అని రేవంత్ రెడ్డి వివరించారు.


కేసీఆర్ కు సీఎం విజ్ఞప్తి 



ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కీలక విజ్ఞప్తి చేశారు. 'మీరు, మీ శాసనసభ్యులు మేడిగడ్డకు రండి. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండి. మీ అనుభవాలను.. తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అక్కడ అందరికీ వివరించి చెప్పండి. జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా?. తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..?. కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారు. కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా. మీకు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే.. హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంది. రేపో ఎల్లుండో సాగునీటి  ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారు. కాళేశ్వరం కథేంటో సభలో తేలుద్దాం.' అని సీఎం పేర్కొన్నారు.


మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి


కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా రావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఈ అంశంపై తాము మాట్లాడితే రాజకీయ విమర్శలు అంటున్నందున వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు.


Also Read: Gruha Jyothi: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి మార్గదర్శకాలు, వివరాలు సేకరిస్తున్న సిబ్బంది