Tension Continues For  Defection MLAs: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కరుణ చూపారు. వారు పార్టీ మారారని సాక్ష్యాలు లేవని పిటిషన్లు తిరస్కరించారు. మరో నలుగురి పిటిషన్లు కూడా ఇలాగే తిరస్కరించే అవకాశం ఉంది. ఒక్క దానం నాగేందర్ విషయంలో మాత్రం ఏం చేస్తారన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే మరి ఈ పది మంది ఎమ్మెల్యే ఇంతటితో గండం గట్టెక్కలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ న్యాయపోరాటానికి రెడీ అయింది. 

Continues below advertisement

కోల్‌కతా హైకోర్టు సంచలన నిర్ణయం

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బిజెపి నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఒక ఎమ్మెల్యే విషయంలో కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ ఆ ఎమ్మెల్యేపై అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారు. కానీ ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ, సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేస్తూ  హైకోర్టు తీర్పు చెప్పింది.  పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్  స్ఫూర్తిని కాపాడటంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని ఈ తీర్పు స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం స్పీకర్లు నిర్ణయాలను కాలయాపన చేయడం లేదా ఏకపక్షంగా తిరస్కరించడం చెల్లదని ఈ తీర్పు ద్వారా వెల్లడైంది.

Continues below advertisement

బీఆర్ఎస్ న్యాయపోరాటం - వ్యూహం

ప్రస్తుతం స్పీకర్ అనర్హతా పిటిషన్ ను తోసి పుచ్చినందుకు బీఆర్ఎస్ ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్లే యోచనలో ఉంది. కోల్‌కతా హైకోర్టు తీర్పును  ఉదహరిస్తూ తెలంగాణలోనూ అదే తరహా తీర్పు రావాలని కోరవచ్చు. ఒకవేళ కోర్టు అనర్హత వేటు వేస్తే, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. ఇది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేయగలదు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్య విరుద్ధమనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.  కోల్‌కతా హైకోర్టు తీర్పును ఉదాహరణగా చూపిస్తూ, ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని బీఆర్ఎస్ వాదించే అవకాశం ఉంది.  స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసి అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ పోరాడనుంది. అలాంటి వాదనుల జరిగితే ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 

దానం నాగేందర్ కు రిస్క్ ఎక్కువ ! 

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారన్న విషయం అందిరకీ తెలుసు. కానీ వారు  పార్టీ మారలేదని చెప్పి కవర్ చేసుకున్నారు. నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఒత్తిడి ఉంది కాబట్టి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఐదుగురిపై నిర్ణయం ప్రకటించినా మొత్తం 9 మందిని పార్టీ మారలేదని చెప్పి స్పీకర్ కాపాడుతారు. కానీ దానం నాగేందర్ విషయంలో  మాత్రం సాధ్యం  కాదు. ఆయన కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు కూడా.  ఆయన విషయంలో కాలయాపన చేయాలి లేదా రాజీనామా చేయించాలి.  బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు  కోల్‌కతా హైకోర్టు తీర్పు ధైర్యాన్ని ఇస్తోంది.  ఇది తెలంగాణలోని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హెచ్చరిక లాంటిదే. స్పీకర్ అధికారాలకు న్యాయ సమీక్షా అధికారం అతీతం కాదని ఈ తీర్పులు నిరూపిస్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ ధైర్యంగా ఉంది. న్యాయపోరాటానికి రెడీ అవుతోంది.