Harish Rao Tweet on Telangana Government: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి.. 22 రోజులు గడుస్తున్నా జీతాలు రాక అంగన్వాడీలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 'ఉద్యోగులు నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బందికి జీతాలు చెల్లించాలి.' అని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.






అలాగే, సన్ ఫ్లవర్ పండించిన రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని.. మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి ట్విట్టర్ వేదికగా హరీష్ రావు తీసుకొచ్చారు. 'ఈ ఏడాది మద్దతు ధర రూ.6,760 ఉండగా మార్కెట్ లో మాత్రం రూ.4 వేల నుంచి రూ.5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్రతి క్వింటాలుకు దాదాపు రూ.2 వేలు నష్టపోతున్నారు. గతంలో మా ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరకు రైతుల నుంచి సన్‌ ఫ్లవర్ కొని రైతులను ఆదుకున్నాం. మీరు వెంటనే అధికారులను ఆదేశించి రాష్ట్ర వ్యాప్తంగా సన్‌ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధరకు సన్‌ ఫ్లవర్ కొని రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాను.' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.






విమర్శ - ప్రతి విమర్శలు


మరోవైపు, సిద్ధిపేట సబ్ స్టేషన్ లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో సైతం బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు సాగాయి. ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ సబ్ స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు పేలటంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక దాని తర్వాత ఒకటి పేలుతుండటంతో.. భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిన శబ్దాలతో చుట్టుపక్కల స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంతో.. సిద్దిపేట (Siddipet)మొత్తం విద్యుత్ నిలిచిపోవడంతో పట్టణమంతా అంధకారం అలుముకుంది. అయితే ఈ ఘటనకు రాజకీయం రంగు పులుముకుంది. విద్యుత్ సరఫరా నిర్వహణలో కాంగ్రెస్(Congess) ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యిందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించాయి. కాంగ్రెస్ ను ఓడించిన సిద్ధిపేట(Siddipet) ప్రజలను చీకట్లో మగ్గపెట్టి ఆ పార్టీ పగ తీర్చుకుంటోందంటూ  విమర్శలు గుప్పించారు. సిద్దిపేట పట్టణంతో పాటు 5 మండలాలకు సరఫరా నిలిచిపోయిందంటూ మండిపడుతున్నారు.


సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని తెలియగానే ప్రమాదం జరిగిన ప్రాంతానికి మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)చేరుకున్నారు. చుట్టుపక్కల నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలను అదుపు చేయించారు. దాదాపు మూడు గంటల పాటు సబ్ స్టేషన్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడి నుంచే  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి మాట్లాడిన హరీశ్ రావు తక్షణం హైదరాబాద్ నుంచి విచారణ బృందాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సిద్ధిపేటకు చేరుకున్న తర్వాత  వాళ్లతో మాట్లాడిన హరీశ్ రావు ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కౌంటర్


బీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. అగ్ని ప్రమాదాలు అనుకోకుండా సంభవిస్తాయని వీటికి ఎవరూ కారకులు కారని కౌంటర్ ఇచ్చింది. సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదానికి  కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్.. రెండు నెలల క్రితం వరకు మీ పార్టీయే అధికారంలో ఉందని వారు ఎందుకు నిర్వహణ పట్టించుకోలేదని మండిపడింది. అగ్నిప్రమాదం జరిగిన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి చౌకబారు విమర్శలు ఏంటని మండిపడింది.


Also Read: Komatireddy: హైదరాబాద్‌కు ట్రిపులార్ ఒక సూపర్ గేమ్ ఛేంజర్ – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి