BRS MLA harish rao condemn rumours of joining in BJP | హైదరాబాద్: అసలే తెలంగాణ అసెంబ్లీ ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మాజీ సీఎం కేసీఆర్‌ను మరింత నిరుగార్చాయి. దాంతో బీఆర్ఎస్ మనుగడపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు అయితదని సైతం కొందరు నేతలు వ్యాఖ్యానించారు. పార్టీని కాపాడేందుకు కేసీఆర్ కొత్త వ్యూహానికి తెరలేపారని, అందులో భాగంగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ కొత్త కుట్ర అని కాంగ్రెస్ నేత ఆరోపణలు
బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావును బీజేపీలోకి పంపుతున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. వరుస ఓటములతో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పార్టీని కాపాడుకునేందుకు కొత్త కుట్రలకు తెరలేపారని, అందులో భాగంగానే హరీష్ రావును బీజేపీలోకి పంపుతున్నారని వ్యాఖ్యానించారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి.. నేను తిట్టినట్టు చేస్తా అనే మీ ఎత్తుగడలు అర్థం కాక BRS ఎమ్మెల్యేలు ఆగం అవుతున్నారంటూ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. అసలే కుమార్తె కవిత ఢిల్లీలో జైల్లో ఉందని, మరోవైపు పార్టీని, ఆస్తుల్ని రక్షించుకునేందుకు, అల్లుడు హరీష్ రావు భుజంపై తుపాకీ పెట్టి కాల్చేందుకు కేసీఆర్ చేసిన కుట్రను రాష్ట్ర ప్రజలు గమనించారని చెప్పారు. బీజేపీలో హరీష్ రావు చేరిక అని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు - హరీశ్ రావు హెచ్చరిక
బీజేపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ABP Desam మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును వివరణ కోరింది. తనపై దురుద్దేశంతోనే కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని.. ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తాను క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ సైనికుడినని, కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తగానే పని చేస్తానని ఏబీపీ దేశంకు చెప్పారు. గెలుపు ఓటములు సహజం అని ప్రజా తీర్పుకు అనుగుణంగా పని చేస్తామన్నారు. ప్రజలు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. కానీ పార్టీ మారుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తే సహించేంది లేదని హెచ్చరించారు.