Visakha Sarada Peetham News: విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వామి స్వరూపా నందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇలా తాను చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని ఎవరు అనుకోవద్దని అన్నారు. ఏపీ రాజధానిగా తీర్చిదిద్దే అమరావతిలో తమ విశాఖ శారదా పీఠానికి స్థలం ఉందని, అక్కడ పీఠాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామని స్వరూపానందేంద్ర అన్నారు.


‘‘అమ్మవారి కృపతో మూడో సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేదారీ.. హరిద్వార్ తో సహా ఉత్తర భారతదేశం మొత్తం మోదీ అభివృద్ధి చేశారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి లభించడం సంతోషకరం.


శ్రీ మహా లగ్నంలో 11.25 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది శుభ లగ్నం. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నా. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏపీని చంద్రబాబు ఆదుకుంటారని ఆశిస్తున్నాను. ఏపీ రాజధానిగా తీర్చిదిద్దే అమరావతిలో మా పీఠానికి స్థలం వుంది. అక్కడ పీఠాన్ని అభివృద్ధి చేస్తాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమ్మవారి అశీస్సులు వుండాలని ఆశిస్తున్నా. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హయాంలో దేవాదాయ శాఖ అభివృద్ధి చెందాలని కోరుతున్నా. శ్రీశైలంలో  మాఘమాసంలో కూంభాభిషేకం వద్దని లేఖ రాశాను.. వినలేదు.. ఏం జరిగిందో చూశారు కదా. 


స్వరూపానందేంద్ర ప్రభుత్వాలపై బతికే పీఠం కాదు. ఎప్పుడూ ప్రజల పక్షాన శారదా పీఠం వుంటుంది. గతంలో చంద్రబాబు హయాంలో మురళీ మోహన్ గెలవాలని రాజమండ్రిలో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టాను. రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద దిక్కు చంద్రబాబు. బాబు హయాంలో టీటీడీ అభివృద్ధి జరుగుతుంది. ఎరుక కంటే మరుపు ఎక్కువ.. శారదా పీఠానికి ఎందరో మంత్రులు.. గవర్నర్ లు వచ్చారు.. వైఎస్సార్ సీపీ మంత్రులు మాత్రమే రాలేదు. ఇది ధర్మం కోసం పని చేస్తున్న పీఠం’’ అని స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు.


జగన్ హాయాంలో భూముల కేటాయింపు
గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠానికి అమరావతి ప్రాంతంలో భూముల కేటాయింపు చేశారు. ఇంకా భవన నిర్మాణ అనుమతులు కూడా ఇచ్చారు. ఆ వ్యవహారం అప్పట్లో బాగా వివాదాస్పదం అయింది. శారదాపీఠానికి జగన్ అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపై బాగా విమర్శలు వచ్చాయి. వైసీపీతో బాగా దగ్గరగా స్వరూపానందేంద్ర మెలిగారు. అలాంటి స్వరూపానందేంద్ర వైసీపీ ఓటమి పాలైన వెంటనే చంద్రబాబుపై పొగడ్తలు చేశారు. మరోవైపు, చంద్రబాబు స్వరూపానందేంద్రను గతంలో ఓ సందర్భంలో దొంగ స్వామి అన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సహజంగానే స్వరూపానందేంద్రను వ్యతిరేకించేవారు. తాజాగా అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వం కేటాయించిన భూముల కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందనే భయంతోనే స్వరూపానందేంద్ర ఇలా పొగడ్తలు చేశారని అంటున్నారు.