ఏపీలోని విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉన్నాయి. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సెలవులను ఒకరోజు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 13 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 


జూన్ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు జూన్ 13న పాఠశాలలు తెరచుకోనున్నాయి.


మరోవైపు ఏపీలోని పాఠశాలలను జూన్ 12కు బదులుగా జూన్ 13న తెరవాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు వినతి పత్రం అందజేసిన సంగతి తెలిసిందే. పాఠశాలల పునఃప్రారంభ తేదీని వాయిదా వేయాలని అందులో కోరారు.  


కాగా ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలవుల తర్వాత కొత విద్యాసంవత్సరం (2024-25)లో విద్యాసంవత్సరానికి గానూ జూన్‌ 12 నుంచి పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. తాజా పరిణామంతో ఒకరోజు తర్వాత అంటే జూన్‌ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో పాఠశాలలకు విద్యాక్యాలెండర్ ప్రకటించాల్సి ఉంది.


తెలంగాణలో జూన్ 12 నుంచే ప్రారంభం..
ఏపీలో ఒకరోజు ఆలస్యంగా స్కూల్స్ ఓపెన్ అవుతుండగా.. తెలంగాణలో మాత్రం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 12న బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. బడిబాట కార్యక్రమంలో భాగంగా జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సరికొత్త ప్రచారం షురూ చేయనున్నారు అధికారులు. ఈ ప్రచారాన్ని అమ్మ కమిటీలకే బాగోగులు, బాధ్యతలను అప్పగించారు. ప్రైవేటు మోజు నుంచి తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేయనున్నారు.


తెలంగాణ వ్యాప్తంగా జూన్ 7 నుంచే 'బడిబాట' కార్యక్రమం మొదలైన సంగతి తెలిసిందే. జూన్ 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, ఆపై అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించబోతున్నారు.

అకడమిక్ క్యాలెండర్ విడుదల..
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రభుత్వం మే 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త క్యాలెండర్ ప్రకారం జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో  1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది.  ఉన్న‌త పాఠ‌శాల‌లు ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంట‌ల వ‌ర‌కు, అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్స్ ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 24న ముగియనున్నాయి.
తెలంగాణ స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..