Leopard at Modi 3.0 cabinet oath-taking ceremony: భారత దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో (Rastrapathi Bhavan) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాధినేతలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఎస్పీజీ, ఎన్ఎస్‌జీ, కేంద్ర బలగాల అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. అయితే, ఇంత పటిష్ట భద్రత మధ్య ఆదివారం ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్రమాణస్వీకారం జరుగుతుండగా ఓ జంతువు అటువైపుగా వెళ్లడం కనిపించింది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన దుర్గాదాస్ ఉయికే ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి (Droupadi Murmu) ధన్యవాదాలు తెలియజేసేందుకు వెళ్లారు. సరిగ్గా ఈ సమయంలోనే ఓ గుర్తు తెలియని జంతువు స్టేజీ వెనుక భాగంలో వెళ్తూ కనిపించింది. ప్రమాణస్వీకార వేదికకు ఆ జంతువు కొద్ది దూరంలోనే వెళ్లడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వీడియో వైరల్
మరోవైపు, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలుత ఇది ఫేక్ అని ఎడిటెడ్ అని భావించినప్పటికీ.. ప్రధాని కార్యాలయం ఆదివారం షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్‌లో గుర్తు తెలియని జంతువు సంచరించడం కనిపించింది. అది పులి అని కొందరు, పిల్లి అయ్యుంటుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా పెంపుడు జంతువు కూడా కావొచ్చనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకూ రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారికి ప్రకటన రాలేదు.
Also Read: PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన - ఎక్కడికో తెలుసా?