Pocharam Joined In Congress Party: కాంగ్రెస్ కండువా కప్పుకున్న తెలంగాణ మాజీ స్పీకర్, సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Sreenivasa Reddy)పై బీఆర్ఎస్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి (Bajireddy Govardhan Reddy), జాజుల సురేందర్ (Jajala Surender) ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మేలు దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పోచారం చెప్పడం ఆత్మవంచనేనని విమర్శించారు. రైతులకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరును పోచారం ఎందుకు మరచిపోయారంటూ నిలదీశారు.


ఈ వయసులో ఏం సాధిస్తారు?
బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జాజుల సురేందర్ మాట్లాడుతూ.. ‘పార్టీ మారడానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన కారణాలు చూస్తే మాకు సిగ్గు వేస్తోంది. పోచారం తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. వ్యవసాయాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మేలు దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పోచారం చెప్పడం ఆత్మవంచనే.  రైతులకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరును పోచారం ఎందుకు మరచిపోయారు? బాన్స్‌వాడ ప్రచారంలో పోచారం కుటుంబాన్ని రేవంత్ రెడ్డి దండు పాళ్యం బ్యాచ్‌తో పోల్చారు. కానీ కేసీఆర్ పోచారంకు స్పీకరు పదవి ఇచ్చారు. లక్ష్మీపుత్రుడు బిరుదు ఇవ్వడంతో పాటు వ్యవసాయ మంత్రిగా మంచి అవకాశం కల్పించారు. ఈ వృద్ధాప్యంలో పోచారం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఏం సాధిస్తారు ?’ అంటూ ప్రశ్నించారు.


దమ్ముంటే రాజీనామా చేయాలి
‘స్వార్థం కోసమే పోచారం పార్టీ మారారు. కేసీఆర్ ఏం తక్కువ చేశారని ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు? పోచారం పోవడంతో బీఆర్‌ఎస్‌కు నష్టం లేదు. కాంగ్రెస్‌కు లాభం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోచారం రాకను జీర్ణించుకోవడం లేదు. ఇసుక దందాలు సాగడం లేదని పోచారం పార్టీ మారుతున్నారు. హామీలు అమలు చేయడం చేత కాక రేవంత్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. పోచారానికి ఏమాత్రం దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. ఆరు నెలల్లోనే రేవంత్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. 
ఓటుకు నోటు దొంగ రేవంత్ మళ్లీ అదే రాజకీయం మొదలు పెట్టారు. ఆయన ఆటలు ఇక సాగవు’ అంటూ మండిపడ్డారు.


బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయ‌కుల‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌తో పాటు మ‌న్నె గోవ‌ర్ధన్ రెడ్డి, కే.వాసుదేవా రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాద‌వ్, ఆంజ‌నేయ గౌడ‌, క‌డారి స్వామి యాద‌వ్, తుంగ బాలు, డి.రాజు, కె.జంగ‌య్య, వ‌రికుప్పల వాసు, చ‌త్తారి ద‌శ‌ర‌థ్, దూదిమెట్ల బాల‌రాజు యాద‌వ్‌ మొత్తం 12 మందిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు న‌మోదు చేశారు. వారందరిని అరెస్ట్ చేసి కోర్టుకు త‌ర‌లించారు. వారిని కోర్టుకు త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో బంజారాహిల్స్ పీఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యక‌ర్తలు ఆందోళ‌న‌కు దిగారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.