Telangana Cabinet :  తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2023 డిసెంబర్ 9కి ముందు  రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తింప చేస్తారు. . పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని  ప్రకటించారు.  ఆరు గ్యారంటీల్లో రుణమాఫీ కూడా కీలకమైన హామీగా ఉంది.                 


రుణమాఫీకి సంబంధించి రూ. 39 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్ లో పలువురు అధికారులు పర్యటించి అధ్యయనం చేశారు. రుణమాఫీకి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టాలన్నదానిపై విస్తృతంగా చర్చలు జరిపారు. కేంద్రం అమలుచేస్తున్న పీఎం కిసాన్‌ పథకం నిబంధనలను రుణమాఫీకి వర్తింపచేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రుణమాఫీ విధివిధానాలను  కేబినెట్ భేటీ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.                    


పీఎం కిసాన్ యోజన నిబంధనలను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే  సీఎం మొదలు ఎమ్మెల్యే వరకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను కడుతున్నవారికి రుణమాఫీ అందదు.  ఇలాంటి ఆంక్షలతో ఎంత మంది ఫిల్టర్ అవుతారు, ప్రభుత్వానికి ఏ మేరకు భారం తగ్గుతుందన్న లెక్కలపై కూడా అసెంబ్లీలో చర్చించారు. అవసరమైన పేద రైతులకు మాత్రమే రుణమాఫీ చేయలని ధనవంతులకు చేయడం వల్ల ఉపయోగం ఉండదని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది.                                         


రుణమాఫీకి అవసరమైన నిధులపైనా కేబినెట్‌లో చర్చించినట్లుగా తెలుస్తోంది.   రుణమాఫీ కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం  పరిశీలన జరిపింది.  కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వచ్చే రుణం, ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ఉండాలంటే అనుసరించిన విధానం తదితర అంశాలపై ఇప్పటికే పూర్తి వివరాలు తెలుసుకున్నారు.వాటిపైనా కేబినెట్‌లో చర్చించారు.     
              


అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైన హామీ రూ. 2 లక్షల రుణమాఫీ. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పంట రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అయితే అధికారం చేపట్టిన తర్వాత సరిపడా నిధులు లేక రుణమాఫీ అమలు ప్రక్రియను ప్రారంభించలేదు. అలాగే లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇది మరింత ఆలస్యమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ మాటను నిలబెట్టుకునే దిశగా కార్యచరణ చేపడుతున్నారు.