Brs Politics : తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్‌లో టిక్కెట్ రేసు జోరందకుంది. మొదటి జాబితా రెడీ అయిపోయిందని.. రేపోమాపో ప్రకటిస్తారని స్పష్టత రావడంతో.. టిక్కెట్ పై అనుమానం ఉన్న నేతలు బలప్రదర్శనకు దిగుతున్నారు. ముఖ్యంగా స్టేషన్ ఘన్ పూర్, జనగామ నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ డౌటన్న ప్రచారం జరుగుతూండటంతో వారి అనుచరులు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని పల్లాకు టిక్కెట్ ?
జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. ఆయన వరుసగా రెండు సార్లు గెలిచారు. ఆయన చుట్టూ అనేక ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆయన కుమార్తె కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదని... కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిక్కెట్ లభిస్తందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పల్లా గోబ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. జనగామ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగి రెడ్డికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వొద్దంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. పల్లా గోబ్యాక్, పల్లా డౌన్ డౌన్ అంటూ నినాదాలు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది.
స్టేషన్ ఘన్ పూర్‌లో కడియంకు టిక్కెట్ ?
ఇక స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఈ సారి తాటికొండ రాజయ్యకు కేసీఆర్ షాక్ ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రాజయ్య వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ల కరుణాపురం వద్ద హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే రాజయ్య మద్దతుదారులు స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే రాజయ్య కె ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై బైఠాయించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున కడియం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక నాయకుడు ముద్దు వలసదారులు వద్దు, దళిత దొర కడియం వద్దు దళిత బిడ్డ రాజయ్య ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కడియం దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నించారు. పోలీసులు వారందర్న అక్కడ్నుంచి పంపేశారు.
పలు నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం పోటీ
పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టిక్కెట్ల కోసం పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈ సారి మారుస్తారన్న ప్రచారంతో.. ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. తమకే టిక్కెట్ వస్తందన్న అంచనాల్లో ఉన్నారు. మరికొన్ని చోట్ల.. బీఆర్ఎస్ అధినేతనే టిక్కెట్ నిరాకరిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో వారు కూడా బలప్రదర్శన చేసి.. తమ సత్తా చూపాలనుకుంటున్నారు. మరో వైపు అసంతృప్తంలదర్నీ బుజ్జగించి.. మొదటి జాబితా విడుదల చేయాలని బీఆర్ఎస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది.