KTR : కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన వాల్మీకి స్కామ్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మేమన్నదే నిజమైందని అన్నారు. వాల్మీకీ స్కామ్‌ పైసలే తెలంగాణ కాంగ్రెస్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని కేటీఆర్ మరోసారి ఆరోపించారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన చార్జిషీట్‌లో పేర్కొందని తెలిపారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారి మళ్లాయని ఆయన ఆరోపించారు. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించిందన్నారు. వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌ అని తేల్చారు.


కాంగ్రెస్ నేతలే కీలకం
తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్‌ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు.  ఇతనికి సంబంధించిన వ్యాపారాల్లోనూ ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు పార్టనర్ లుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారనేది నిర్వివాదంగా పేర్కొన్నారు.  దర్యాప్తు సంస్థలు వాల్మీకీ స్కామ్‌ నిజాలు నిగ్గుతేల్చాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.






5114 పేజీల ఛార్జిషీట్
ప్రచారం అవుతున్న రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా దాదాపు రూ. 20 కోట్ల నగదు బండిల్స్ వాడినట్లు కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్ర వ్యక్తిగత సహాయకుడు విజయ్ కుమార్ గౌడ్ మొబైల్ ఫోన్ వివరాలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. 5,114 పేజీలతో కూడిన చార్జ్ షీట్‌లో 15 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. నాగేంద్ర, సత్యనారాయణ వర్మ (హైదరాబాద్), ఎటకారి సత్యనారాయణ (తెలంగాణ), జెజి పద్మనాభ (కార్పొరేషన్ మాజీ ఎండీ)తో పాటు మరో 20 మంది ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలు చేసినట్లు నివేదిక పేర్కొంది. వాల్మీకి కార్పొరేషన్ ఎండీగా పద్మనాభం నియామకంతో కుట్రకు తెర లేచింది. ప్రధాన నిందితుడు నాగేంద్ర ఇతర అనుమానితులతో, సన్నిహితులతో ఏకాంత సమావేశాలు నిర్వహించి, కొత్త బ్యాంకు ఖాతా తెరిచి డబ్బు జమ చేయాలని పద్మనాభంను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయం వెలుపల సమావేశం జరిగిందని చార్జిషీట్ పేర్కొంది, “నాగేంద్ర,  అతని సహచరులు చేసిన పెద్ద నగదు డిపాజిట్లు ఉన్నాయి. వాటిని వివరించడంలో మాజీ మంత్రి విఫలమయ్యారు. కుట్ర చేయడం, సాక్ష్యాధారాల ధ్వంసం చేయడం, నిధుల దుర్వినియోగంలో నాగేంద్ర కీలక పాత్ర పోషించినట్లు చార్జిషీట్ వెల్లడించింది. జూలై 12న నాగేంద్ర నివాసం, వాల్మీకి కార్పొరేషన్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో దాడులు చేసి ఇడి అరెస్టు చేసింది.


ఆత్మహత్యతో వెలుగులోకి నిజం
మే 26న శివమొగ్గలోని తన నివాసంలో వాల్మీకి కార్పొరేషన్‌ అధికారి పి.చంద్రశేఖరన్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌లో చంద్రశేఖరన్‌ స్కామ్‌తోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తుల వివరాలను వివరించారు. గతంలో క్రీడలు, యువజన సర్వీసులు, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన నాగేంద్ర జూన్ 6న రాజీనామా చేశారు.