హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. పదేళ్ల ఎన్డీఏ పాలనలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు దక్కింది.. అన్యాయాలు.. అవమానాలు.. అవహేళనలే అన్నారు. మీ పాలనలో కేవలం ఉత్తర కాశీని మాత్రం అందంగా తీర్చిదిద్దారు.. దక్షిణ కాశీగా భావించే వేములవాడకు ఏమిచ్చారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.


వరంగల్ జిల్లాకు మరోసారి వచ్చి వెళ్లారు కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీని మాత్రం మరిచారు. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని మరోసారి బొందపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ అత్యున్నత చట్ట సభైన పార్లమెంట్ సాక్షిగా.. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించారు. పురిట్లోనే ఏడు మండలాలు లాక్కొని అన్యాయం చేశారు. బియ్యం కొనమంటే నూకలు తినమని అవహేళన చేశారు. ఇంత ధాన్యం ఎలా పండిందని రైతుల శక్తిని అనుమానించారు. పార్లమెంట్ లో ఇచ్చిన విభజన హామీలకు పదేళ్లుగా పాతరేశారు’ అని కేటీర్ అధికార ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేశారు. 


పక్కనున్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు కానీ, తెలంగాణ జాతికి మాత్రం మొండిచేయి చూపారని కేటీఆర్ విమర్శించారు. పదేళ్లు మీ భజన తప్ప.. విభజన హామీలు సాధించని బీజేపీ ఎంపీలకు తెలంగాణ ప్రజలు ఎందుకు మళ్లీ ఓటేయాలి ? అని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రశ్నించారు. లక్షలాది మందికి ఉపాధినిచ్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును ఆగం చేసిన బీజేపీకి బుద్ధిచెప్పేందుకు యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 


మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడపై కత్తి పెట్టినందుకు.. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వనందుకు, కమలం పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని సెటైర్లు వేశారు. నిత్యవసర వస్తువుల ధరల మోత మోగించి.. పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిన ఎన్డీఏకు గుణపాఠం చెప్పేందుకు మహిళాలోకం సిద్ధంగా ఉందన్నారు. పదేళ్లలో ఒక్క ప్రభుత్వ విద్యాసంస్థ ఇవ్వకుండా ఆగంచేసిన బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. నూకలు తినమని అవమానించిన బీజేపీ నేతల తోకలు కట్ చేయడానికి మొత్తం తెలంగాణ ప్రజలు సిద్ధమన్నారు కేటీఆర్.  


మీ ప్రాధాన్యతలో తెలంగాణ లేనప్పుడు.. మా ప్రజల ప్రాధాన్యతల్లో బీజేపీ ఎలా ఉంటుంది ? అని కేటీఆర్ ప్రశ్నించారు. పదేళ్లలో ఏం చేశారో విషయం చెప్పమంటే.. మళ్లీ విషం చిమ్మి వెళ్లారు. డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్న ఛోటాభాయిపై చర్యలకు మాత్రం వెనకాడుతున్నారని విమర్శించారు. కానీ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు, జేబు సంస్థలతో వెంటాడి వేటాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


ఉత్తర భారతంలో మోడీ వేడి తగ్గడంతో దక్షిణాదిపై బీజేపీ దండయాత్రను సాగిస్తున్నారు. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలు మీ పదేళ్ల  పరిపాలనా తీరు చూశారు. ప్రచార పర్వాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. ఎవరెంత మభ్యపెట్టే ప్రయత్నం చేసినా.. ఇక్కడ అటెన్షన్ డైవర్షన్ కు ఆస్కారం లేదన్నారు. ఎందుకంటే.. ఈ  పార్లమెంట్ ఎన్నికల్లో విభజన హామీలే.. ప్రధాన అంశాలని.. ఆ ప్రజా సమస్యలే తమ ఎన్నికల ఎజెండా అని రాసుకొచ్చారు.