APSRTC TSRTC News: హైదరాబాద్ సహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూర్లకు పయనం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అదే రోజు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను మొత్తం ఒకే విడతలో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు రెండు రోజులు వారాంతపు సెలవులు కూడా కావడంతో ఆంధ్రా ప్రజలు తమకు ఓటు హక్కు ఉన్న సొంతూర్లకు పయనం అవుతున్నారు.
మామూలు రోజుల్లో అయితే, హైదరాబాద్ నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 2 వేలకు పైగా ప్రైవేటు, ఆర్టీసీ బస్సులన్నీ దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. కానీ గత వారం రోజులుగా ప్రతిరోజూ బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో ఉన్నట్లుగా ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రానున్న ఐదారు రోజుల్లో అయితే, రిజర్వేషన్లకు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు. అటు ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలోనూ టికెట్లన్నీ బుక్ అయి.. వందల కొద్దీ వెయిటింగ్ లిస్ట్ లు ఉన్నాయి. ఈ రద్దీ కారణంగా ఆర్టీసీ, రైల్వే యాజమాన్యం ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే హైదరాబాద్ ప్రజలు వెళ్లడానికి సరిపడా బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్నట్లుగా రంగారెడ్డి రీజియన్ మేనేజర్ బి.రాజు తెలిపారు. ఈ నెల 9 నుంచే ఏపీకి రద్దీ ఉంటుందని అంచనా వేశామని.. శని, ఆదివారాల్లో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలోని గ్రామాలకు వెళ్లాలనుకునే వారు కూడా ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు వెళ్లేలా ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. పోలింగ్ రోజు తెల్లవారుజాము నుంచి తిరిగి వచ్చేందుకు అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ రోజూ నడిచే 3,450 బస్సులే కాక, మరో వెయ్యికి పైగా బస్సులను నడుపబోతోంది. దాదాపు 200 బస్సుల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 9 నుంచి 12 వరకు రోజూ నడిచే 352 బస్సులకు అదనంగా 500 బస్సులను నడుపుతున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కిషోర్‌నాథ్ తెలిపారు. అదనపు బస్సుల్లోనూ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని ఆయన తెలిపారు.
రేట్లు పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్
పోలింగ్ సందర్భాన్ని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. రిజర్వేషన్లకు బాగా డిమాండ్ ఉండడంతో ఒక టిక్కెట్ ధరను ఇష్టారీతిన మూడు నాలుగు రెట్లు పెంచేశారు. రూ.500 టిక్కెట్ రూ.1500 వరకూ ఉంటోంది. విజయవాడ వెళ్లాలంటే రూ.వెయ్యి దాకా టికెట్ ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు.