BRS Formation Day : భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న నిర్వహించనున్నారు. శనివారం అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని కేటీఆర్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అందరూ బిజీగా ఉన్నందున హంగామా కార్యక్రమాలేమీ వద్దని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పార్టీ నేతలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
2001, ఏప్రిల్ 27 న టీఆర్ఎస్‌ను ప్రారంభించిన కేసీఆర్
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి సొంత రాష్ట్రం తెలంగాణ ను సాధించాలన్న లక్ష్యంతో కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు. ఆ రోజు తనతో పాటు వచ్చిన కొంత మంది నేతలతో ఆయన తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. అనేక ఒడి దుడుకులు ఎదుర్కొన్నారు. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని ఉద్దృత స్థాయికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజనను పూర్తి చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ సాధారణ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. 2019లో భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది.
గత ఏడాది బీఆర్ఎస్‌గా మార్పు - పేరు ఒక్కటే మార్పు
అయితే తెలంగాణ చాలా వరకూ అభివృద్ధి చెందిందని ఇక దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చారు. కానీ అలా మార్చడంతో మొదటికే మోసం వచ్చినట్లయింది. ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. పేరు ఒక్కటే మారింది. గుర్తు .. రంగు ఏదీ మారలేదు. తెలంగాణ మ్యాప్ ప్లేస్ ఇండియా ఫోటో కూడా పెట్టలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పేరు ఉన్నా తెలంగాణ లోగోనే వాడుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ప్రజలు పట్టించుకుంటారా లేదా అన్నది పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోతుంది.
గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్
పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని బీఆర్ఎస్ .. టీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ అనే పేరును .. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును ఈసీ ఫ్రీజ్ చేసిందని కేసీఆర్ చెబుతున్నారు. పార్టీ పేరు మార్పు సాధ్యం కాదంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించే సీట్లను బట్టి ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉందని ఇప్పటికే రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.