BRS Nama :  తాము ఎన్డీఏ కాదు, ఇండియా కూటమి కూడా కాదని బీఎర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు లోక్‌సభలో తేల్చి చెప్పారు. తమ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి అని, తాము దేశ ప్రజలతో ఉన్నామని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలు నామా నాగేశ్వరరావు ప్రసంగించారు.  మణిపూర్ విషయంలో ప్రపంచంలో భారత్ తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. 15వ లోక్‌సభ సమయంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉందని, ఆ సమయంలో కాశ్మీర్ హింసపై అఖిలపక్షం డిమాండ్ చేస్తే తాము సుష్మాస్వరాజ్ వెంట నిలిచామని గుర్తుచేశారు. ఇప్పుడు మణిపూర్ విషయంలో కూడా అఖిలపక్షాన్ని అక్కడికి తీసుకెళ్లాలని కేంద్రానికి సూచించారు. 


తెలంగాణపై అడుగడుగునా కేంద్రం వివక్ష           


తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షపై నామా నాగేశ్వరరావు ఎక్కువగా మాట్లాడారు.   ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేవరకు రాజకీయం చేస్తుందని, కానీ ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానం కావాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో అడుగడుగునా పక్షపాత ధోరణి అవలంభిస్తోందని నామా నాగేశ్వర రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయిందని, అలాగే నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడి కూడా తొమ్మిదేళ్లయిందని గుర్తుచేస్తూ.. ఈ తొమ్మిదేళ్లుగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


విభజన చట్టం అమలు చేయకుండా అన్యాయం               


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పొందుపర్చిన హామీల ప్రకారం తన నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాల్సి ఉందని, అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు.  స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకపోగా, కోచ్ ఫ్యాక్టరీలను వేరే రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు తప్ప తెలంగాణలో ఏర్పాటు చేయలేదని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ , ట్రైబల్ యూనివర్సిటీ వంటి హామీలు కూడా అమలు కాలేదని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు కొత్తగా మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తున్నామని నామ నాగేశ్వర రావు ప్రకటించారు. 


అవిశ్వాసానికి బీఆర్ఎస్ మద్దతు


 తెలంగాణ భారతదేశంలోనే భాగం కాదా అని నామా  ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అడిగినా సరే నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదని, అప్పటికే మంజూరైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ – ఐటీఐఆర్  ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసిందని మండిపడ్డారు. తెలంగాణ అమలు చేస్తున్న కొన్ని పథకాలను కేంద్రం కాపీ చేస్తోందని, మంచి ఆలోచనను కాపీ చేయడంలో తప్పేమీ లేదని నామ నాగేశ్వర రావు అన్నారు. మిషన్ భగీరథ పేరుతో తాము ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటి పైప్ లైన్ల ద్వారా అందజేస్తున్నామని, ఈ పథకాన్ని హర్ ఘర్ జల్ పేరుతో కేంద్రం అమలు చేస్తోందని అన్నారు.