Brs Chief Kcr Meet Farmers: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Kcr) రైతుల వద్దకు వెళ్లనున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లో నేరుగా అన్నదాతలతో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సూర్యాపేట (Suryapeta), నల్గొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
పూర్తి షెడ్యూల్ ఇదే..
☛ ఆదివారం ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. తొలుత జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఎండిన పంటలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడుతారు.
☛ ఉదయం 11:30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు.
☛ మధ్యాహ్నం ఒంటి గంటకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు చేరుకుని.. భోజనం అనంతరం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.
☛ మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నల్లగొండ జిల్లాకు బయల్దేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిన పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడుతారు.
☛ సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి రోడ్డు మార్గంలో ఎర్రవెల్లికి చేరుకుంటారు.
మరోవైపు, సాగునీరు లేక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు స్థానికంగా గ్రామాల్లో ఎండిన పంటలు పరిశీలించి రైతులను పరామర్శించారు.
Also Read: Hyderabad: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కలకలం, ఒంటిపై కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం