Telangana Election Results 2023: గజ్వేల్: బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో ఓటమి తరువాత సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో తొలిసారి సమావేశం అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ తో ఆశీర్వాదం తీసుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరు, ఫలితాలపై కాసేపు వారితో చర్చించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏం చేయాలనే దానిపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడూ నిలదీయాలని నేతలకు సూచించారు.


కేసీఆర్ కు ఎమ్మెల్యే సర్టిఫికెట్ అందజేత
కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి చెందగా, గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కేసీఆర్. నేడు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక నేత వంటేరు ప్రతాపరెడ్డి అందజేశారు. ఆ సమయంలో ప్రతాపరెడ్డి వెంట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.