రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రసిద్ధ ఔషధ సంస్థ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బ్రిస్టల్-మయార్స్ స్క్విబ్(బీఎంఎస్) ఔషధ సంస్థ తెలంగాణలో వచ్చే మూడేళ్లలో 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.826 కోట్లు) పెట్టుబడితో భారీ జీవ ఔషధ సంస్థను స్థాపించనుంది. తద్వారా సుమారు 1,500 మంది ఫార్మా, లైఫ్ సైన్సెస్ అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని బీఎంఎస్ సంస్థ ప్రకటించింది. ప్రధానంగా ఔషధ ఉత్పత్తులు, పరిశోధన, ఐటీ, సృజనాత్మకతలకు పెద్దపీట వేయనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గురువారం (ఫిబ్రవరి 23న) జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఎంఎస్ ఎండీ సమ్మిత్ హిరావత్.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.


ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరం బయోటెక్నాలజీ, ఐటీ రంగాలకు గొప్ప ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్నారు. బీఎంఎస్ కూడా ఈ రెండు రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్‌లోని మానవ వనరుల నైపుణ్యం వారి కార్యకలాపాలకు ఉపయుక్తంగా ఉంటుంది. రాష్ట్రంలో ఫార్మాసిటీ ఏర్పాటు, ఇక్కడ ఉన్న అవకాశాలపై బీఎంఎస్ ప్రతినిధులకు వివరించా. కొత్తగా ఒక సంస్థను స్థాపించాలంటే.. కనీసం 12నుంచి 18 నెలల సమయం పడుతుంది. కానీ హైదరాబాద్ ఫార్మాసిటీలో అలా కాకుండా.. అత్యంత వేగంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సౌలభ్యముంది అని కేటీఆర్ పేర్కొన్నారు.


ప్రపంచంలోనే మొదటి 10 ప్రసిద్ధ ఔషధ సంస్థల జాబితా తీసుకుంటే.. అందులో బీఎంఎస్ ఒకటి. తెలంగాణ రాష్ట్రానికి వారిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 2028 నాటికి రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ వ్యవస్థ విలువను రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా.. తాజాగా బీఎంఎస్‌తో అవగాహన కుదిరింది. బయో ఆసియా సదస్సు ప్రారంభమవుతున్న ఈ సందర్భంలో ఈ ఒప్పందం కుదరడం శుభ పరిణామం.  లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ఈ సంస్థ ఏర్పాటు ఒక గొప్ప అవకాశమని కేటీఆర్‌ అన్నారు. 


ఎంఓయూ ద్వారా 1,500 మందిని నియమించుకుంటామన్న బీఎంఎస్‌ కంపెనీ త్వరలోనే తమ లక్ష్యాన్ని చేరుకొని మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న నమ్మం తమకు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం సందర్భంగా హైదరాబాద్‌ ఫార్మాసిటీలో ఉన్న అవకాశాల గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించినట్లు చెప్పారు.


పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తాం: సమ్మిత్ హిరావత్
బీఎంఎస్ సంస్థ ఎండీ సమ్మిత్ హిరావత్ మాట్లాడుతూ.. మా కంపెనీ ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, వైద్యరంగాల్లో అనేక సేవలను అందిస్తోంది. ఆయా రంగాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఐదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చినప్పటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటే.. ప్రస్తుతం మౌలిక వసతుల విషయంలో నగరం ఎంతో అభివృద్ధి చెందింది. మా కేంద్రం ఐటీ, టెక్నాలజీ, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించబోతోంది. ప్రధానంగా ఆంకాలజీ, హెమటాలజీ, సెల్‌ థెరపీ, ఇమ్యూనోలజీ, కార్డియోవాస్క్యులర్ వ్యాధులకు ఔషధాల ఉత్పత్తి, ప్రయోగాలు నిర్వహిస్తోంది. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తాం అని తెలిపారు.