Bridge Collapsed At Maneru River: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ముత్తారం (Muttaram) మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, ఈదురు గాలుల బీభత్సానికే వంతెన కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురు గాలుల ప్రభావంతో బ్రిడ్జిపై ఉన్న గైడర్లు కింద పడిపోయాయి. నాసిరకమైన పనులు జరుగుతుండటంతోనే బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016లో ఆగస్టులో రూ.49 కోట్లతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభం కాగా.. మధ్యలో గుత్తేదారులు మారడం, నిధుల లేకపోవడం వంటి కారణాలతో బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో తొమ్మిదేళ్లు గడిచినా బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకూ 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
తప్పిన పెను ప్రమాదం
ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. వంతెన కూలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఆ వైపు రాకపోకలు నియంత్రించారు. పగటివేళ వంతెన కూలుంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో వంతెన నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. పిల్లర్లు, గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్కలు చెదలు పట్టడంతో గట్టర్లు ఓ వైపు వంగినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల బ్యాలెన్స్ తప్పి వంతెన కూలినట్లు సమాచారం.
Also Read: Suryapeta Accident: తీవ్ర విషాదం - కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లి దంపతుల దుర్మరణం, ఎక్కడంటే?