Telangana Phone tapping case :  ఫోన్ ట్యాపింగ్ వల్లనే  సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్నారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని  హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బిజెపి నేతలు ధర్నా చేప్టటారు. ఈ ధర్నాలో మాట్లాడిన బూర నర్సయ్య గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో  బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా భవనగిరి నుంచి  పోటీ చేశారు బూర నర్సయ్య.



హరీష్  రావు  ఫోన్ కూడా ట్యాప్ !                                 


బీఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించారని, ఓ ఫైల్ కూడా తయారు చేశారని బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వినా కొద్ధీ కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని, అందరి వేళ్లు పెద్దాయన వైపు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి ట్యాపింగ్ వ్యవహారం మొదలైందన్నారు.   అసెంబ్లీ ఎన్నికల వరకు జరిగిందని మండిపడ్డారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఎస్‌ఐబి, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలంతోనే ట్యాపింగ్ ఆపరేషన్ బయటకు వచ్చిందన్నారు.  
               
సీబీఐ విచారణ డిమాండ్‌తో ధర్నా                          


ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు… ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, వెంటనే సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అసలైన నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని, దీనంతటికీ కీలక సూత్రధారి మాజీ సీఎం కేసీఆరే అని విచారణలో తేలిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత వరకు కేసీఆర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. 


బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు కేసీఆర్ కుట్ర చేశారని నిందితుల వాంగ్మూలం           


ఫోన్ ట్యాపింగ్  కేసుపై బీజేపీ ఇంత ఆసక్తి చూపించడానికి కారణం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో..  బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరు అయిన బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసుల్ని కేసీఆర్ పంపారని రాధాకిషన్  రావు తన స్టేట్‌మెంట్ లో చెప్పడంగా భావిస్తున్నారు. ఇంకా బీజేపీ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అయి ఉంటాయని.. సీబీఐకి ఇస్తేనే న్నీ తెలుస్తాయని అనుకుంటున్నారు.