Bodhan BRS Flex War : నిజామాబాద్ జిల్లా బోధన్ లోని బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుతోంది. ఓ చలివేంద్రం ఏర్పాటు చేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త శరత్ రెడ్డి ఫ్లెక్సీ వేయించారు. ఇందులో ఎమ్మెల్యే ఫోటో లేకుండా కేసీఆర్, కేటీఆర్, కవిత ఫొటోలు మాత్రమే పెట్టారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు ఫ్లెక్సీని చింపేశారు. ఫ్లెక్సీ చింపిన విషయంపై శరత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మళ్లీ బోధన్ లో ఫ్లెక్సీవార్ మొదలైంది. ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ ఛైర్మన్ తూము పద్మావతి భర్త శరత్ రెడ్డి ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారు. కానీ కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. అనేక ఏళ్లుగా కలిసివున్న వీరి స్నేహం నువ్వా నేనా అనే స్థితికి చేరింది. దీంతో బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు పార్టీ శ్రేణుల్లో ఆందోళనను కలిగిస్తోంది. వీరి మధ్య వైరం అధిష్టానానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. బోధన్ పట్టణంలో ఫ్లెక్సీల వార్ విభేదాలను బహిర్గతం చేసింది. 




ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో బోధన్ లో పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. తన సొంత నియోజకవర్గమైన బోధన్ లో జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. కీలకమైన బోధన్ పట్టణంలో వర్గపోరుకు దారితీయడం పార్టీకి నష్టం కలిగించే అంశమే. మున్సిపల్ ఛైర్మన్ భర్త శరత్ రెడ్డికి బోధన్ పట్టణంతో పాటు రూరల్ ఏరియాలో మంచి పట్టుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శరత్ రెడ్డి పార్టీ మారితే బీఆర్ఎస్ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే గత కొద్ది నెలలుగా నెలకొన్న రగడపై అధిష్టానం, జిల్లా నాయకత్వం ఎలాంటి చొరవ తీసుకోకపోవడం వీరి మధ్య దూరం మరింత పెరిగినట్లు చేసింది.  


 వివాదం రేపిన ఫ్లెక్సీలు 


బోధన్ లో ఫ్లెక్సీల వార్ మొదలైంది. చాలాకాలం నుంచి అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పటికీ ఇటీవలే అవి బహిర్గతం అయ్యాయి. మార్చి 7న ఎమ్మెల్యే షకీల్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పద్మావతి ఫొటో వేయలేదు. దీనిని అవమానంగా భావించిన శరత్ రెడ్డి తర్వాత మార్చి 13న వచ్చిన ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా ఛైర్మన్ పద్మావతి తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే షకీల్ ఫొటో పెట్టలేదు. ఎమ్మెల్యే ఫొటో పెట్టకపోవడంపై ఆగ్రహంతో కొందరు ప్లెక్సీలను చింపివేశారు. ఈ ఫ్లెక్సీల వివాదంతో ఒక్కసారిగా విభేదాలు వీధికెక్కాయి. ఇది మరువక ముందే నాలుగు రోజుల క్రితం శరత్ రెడ్డి తన ఛారిటీ నుంచి పట్టణంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ఫ్లెక్సీలో ఎమ్మెల్యే షకీల్ ఫొటో లేకపోవడాన్ని గుర్తించిన అనుచరులు మళ్లీ ఫ్లెక్సీని చింపేశారు. ఈసారి శరత్ రెడ్డి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో కొంత వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో చివరికి పిర్యాదు తీసుకున్నారు. అటు శరత్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేయడం కలవరం రేపింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఏసీపీ కేసు నమోదు చేయటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రగడ ఎటువైపు మలుపు తిరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.


 శివాజీ విగ్రహంతో మొదలైన విభేదాలు? 


బోధన్ పట్టణంలో రెండేళ్ల క్రితం శివాజీ విగ్రహం ఏర్పాటు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు రంగంలోకి దిగడంతో వారం రోజుల తర్వాత వివాదం సద్దుమణిగింది. శివాజీ విగ్రహం ఏర్పాటు రాత్రికిరాత్రే జరిగింది. ముందురోజు శరత్ రెడ్డి రైస్ మిల్ లో విగ్రహం పెట్టారని వార్తలు వచ్చాయి. విగ్రహం పెట్టించడంలో శరత్ రెడ్డి హస్తం ఉందని భావించిన ఎమ్మెల్యే షకీల్ అప్పటి నుంచి శరత్ రెడ్డి పై కోపం పెంచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి శివాజీ విగ్రహం ఏర్పాటు తర్వాతనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి దూరం పెరిగింది. తర్వాత ఛైర్ పర్సన్ కు అధికారుల నుంచి, కొంతమంది కౌన్సిలర్లతో సహాయనిరాకరణ మొదలయ్యింది. మున్సిపల్ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. విభేదాలతో ఛైర్ పర్సన్ పద్మావతి, భర్త శరత్ రెడ్డిలు తీవ్ర నిరాశలో ఉన్నారు. అధిష్టానం కూడా పట్టించుకోకపోవడం, షకీల్ మెట్టుదిగకపోవడం దూరాన్ని పెంచడమే కాకుండా విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీలో శరత్ రెడ్డి దంపతులు ఇమడలేకపోతున్నామని అనుచరులతో అన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ కు మున్సిపల్ ఛైర్ పర్సన్ దంపతులు స్వస్తి చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఛైర్ పర్సన్ మధ్య విభేదాలకు అధిష్టానం ఎప్పుడు ఫుల్ స్టాఫ్ పెడుతుందని బోధన్ బీఆరెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.