Chittoor Crime : వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. అతి తక్కువ కాలంలో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధాలకు దారి తీసి చివరికి వారి ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నాయి. పదేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ కూలీ పనులు చేసుకుని పిల్లలను పోషించుకుంటున్న వివాహితకు రెండేళ్లకు ముందు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ వివాహేత సంబంధమే చివరికి ఆ మహిళ ప్రాణాలను సైతం తీసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో‌ కలకలం రేపుతుంది. 


అసలేం జరిగింది? 


చిత్తూరు తాలూకా పోలీసు‌ స్టేషన్ సీఐ గంగిరెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు రూరల్ మండలం, మాపాక్షి గ్రామానికి సమీపంలోని శేషాచలపురం ఎస్టీ కాలనీలో కస్తూరి అనే వివాహిత నివసిస్తోంది. అయితే పదేళ్ల క్రితం భర్తతో విభేధాలు తలెత్తడంతో అప్పటి నుంచి భర్తతో విడిపోయి శేషాచలపురంలో నివాసం ఉంటూ గొర్రెలు కాస్తూ, కూలీ పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను పోషిస్తుంది. ఈ క్రమంలో కూలీ పనులకు వెళ్లిన సమయంలో గత రెండేళ్ల క్రితం పక్క గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తితో కస్తూరికి పరిచయం ఏర్పడింది. ఈ‌ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి కస్తూరి శ్రీరాములుతో సహజీవనం సాగిస్తూ వస్తోంది.  ఇద్దరు కలిసి‌ కూలీ‌ పనులకు వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకునేవారు. అయితే ఇద్దరు కూలీ పనులు ముగించుకున్న తర్వాత మద్యం సేవించే అలవాటు ఉండడంతో కలిసి సేవించేవారు. ఇలా కొన్నాళ్ల పాటు వీరి సహజీవనం సాఫీగానే సాగింది. గత కొద్ది రోజులుగా కస్తూరీ ప్రవర్తనలో శ్రీరాములు మార్పు గమనిస్తూ వచ్చేవాడు. 


కొడవలితో దాడి 


కస్తూరి మరొక వ్యక్తితో చనువుగా ఉండడాన్ని గమనించిన శ్రీరాములు గట్టిగా మందలించాడు. ఇదే విషయంలో ఇద్దరికి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే సోమవారం మధ్యాహ్నం కస్తూరి గొర్రెలను తీసుకుని గ్రామం పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఇది గమనించిన శ్రీరాములు కూడా కస్తూరితో పాటు ఆ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అదే సమయంలో కస్తూరి మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు శ్రీరాములు.  ఇదే విషయంపై ఇద్దరూ‌ కొంత సేపు గొడవ పడ్డారు. కస్తూరి చెప్పిన మాటను ఏమాత్రం జీర్ణించుకోలేని శ్రీరాములు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై కస్తూరి గొర్రెలకు మేత కొసేందుకు తీసుకుని వచ్చిన కొడవలితో ఒ్కసారిపై ఆమెపై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా అటవీ ప్రాంతంలో‌ నుంచి పరారయ్యాడు. అయితే సాయంకాలం అవుతున్నా ఎంతకీ తన తల్లి‌ ఇంటికి రాకపోయే సరికి అనుమానం వచ్చిన కస్తూరి కుమారుడు తన బంధువుల సాయంతో అటవీ ప్రాంతంలో గాలించాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో రక్తపు మడుగులో విగతజీవిలా పడి ఉన్న తన తల్లిని చూసి కస్తూరి కుమారుడు కన్నీరు‌మున్నీరుగా విలపించాడు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు శవపరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పరారీలో‌ ఉన్న నిందితుడు శ్రీరాముల కోసం తాలూకా పోలీసులు గాలిస్తున్నారు.