BL  Santosh Comments :  తనపై తప్పుడు ఆరోపణలు చేసిన దానికి పర్యవసానాలు అనుభవించాల్సిందేనని బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రచారక్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ కేసు గురించి ప్రస్తావించారు. తన పేరు తెలంగాణలో ఒక్కరికీ తెలియదని..కానీ ఫామ్ హౌస్ కేసు పేరుతో తప్పుడు ఆరోపణలు చేసి అందరికీ తెలిసేలా చేశారన్నరు. తెలంగాణ తల్లి పేరుతో తెలంగాణకే ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న నేతలు ప్రజాస్వామ్యానికి  హాని చేసేవాళ్లని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వమే సమధానం చెప్పాలన్నారు. 


ఫామ్ హౌస్ కేసులో  కీలకంగా వినిపించిన పేరు బీఎల్ సంతోష్ 


ఫామ్ హౌస్ కేసు వ్యవహారంలో  ఎక్కువగా వినిపించిన పేరు బీఎల్ సంతోష్. ఆయన బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ అంతర్గతంగా పార్టీ వ్యవహారాలు చక్క బెడుతూంటారు. శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే   ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో బేరాలాడుతూండగా నందకుమార్ తో పాటు ఇద్దరు స్వామిజీలను పట్టుకున్నామని పోలీసులు ప్రకటించిన తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నందకుమార్ తో పాటు ఉన్న స్వామిజీ రామచంద్ర భారతి బీఎస్ సంతోష్‌తో చాటింగ్ చేశారని.. ఆయన అనుమతితోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చోటు చేసుకుందని పోలీసులు తేల్చారు. 


సిట్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టుకు వెళ్లిన బీఎల్ సంతోష్ 


ఫామ్ హౌస్ కేసులో ఆయనను నిందితుడిగా చెబుతూ.. నోటీసులు కూడా జారీ చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు కూడా చేర్చారు. మొదట సిట్ ఆయనకు ఢిల్లీలో నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. దీంతో హైకోర్టుకు వెళ్లి వాట్సాప్ ద్వారా నోటీసులు అందించేలా ఆదేశాలు తెచ్చుకుంది. అయితే తర్వాత బీఎస్ సంతోష్ హైకోర్టుకు వెళ్లి నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. తర్వాత  ఏసీబీ కోర్టు.. సిట్  దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను తిరస్కరించింది. ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది.  ఈ తీర్పుపై సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అదే సమయంలో నిందితులు కూడా.. సిట్ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని.. సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. కేసును సీబీఐకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 


తప్పుడు ఆరోపణలు చేసినందుకు పర్యవసానాలు తప్పవని తాజాగా హెచ్చరిక 


ఇప్పుడు కేసు సీబీఐకి వెళ్లడంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చ జరుగుతోంది. ఇంకా సీబీఐ కేసు నమోదు చేయలేదు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచనచేస్తోంది. ఇప్పుడు బీఎల్ సంతోష్.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. పర్యవసానాలు తప్పవని హెచ్చరించడంతో  ఈ అంశం మరింత చర్చనీయాంశం అవుతోంది. 


తెలంగాణ ఇంచార్జ్ డీజీపీగా అంజనీకుమార్ - 31న మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ !