General Elections 2024: 1925లో మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రాబోయే వందేళ్లలో చేయాల్సిన లక్ష్యాల కోసం పని చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, రిజర్వేషన్లు తొలగించాలని ప్రాధాన్యంగా పెట్టుకున్నట్లుగా రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్, పౌర సవరణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ అన్నీ ఆర్ఎస్ఎస్ విధానాలు అని రేవంత్ రెడ్డి అన్నారు. 17వ లోక్ సభలో ఇవన్నీ మోదీ సాధించారని.. రాబోయే 18వ లోక్ సభలో రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికాబద్ధంగా ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్లుగా ఓ వీడియో వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం (మే 1) ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి మూడింట రెండింతులు మెజారిటీ వస్తే దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. తన వాదనలపై సరైన వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మోదీ, అమిత్ షాకు ఉందని డిమాండ్ చేశారు.
అందుకే ఢిల్లీ పోలీసులతో నోటీసులు
ఎవరో సోషల్ మీడియాలో అమిత్ షా వీడియో వైరల్ అయితే.. తనను ఆ నేరం ఎందుకు నెడుతున్నారని ప్రశ్నించారు. ‘‘నన్ను ఎందుకు బాధ్యుడ్ని చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయి.. నా మీద సీరియస్ అయింది. ఆగమేఘాల మీద దేశ భద్రతకు ఏదో ముప్పు వచ్చినట్లుగా నాకు నోటీసులు ఇచ్చింది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది. నన్ను విచారణకు రావాలని బలవంతం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలో పని చేస్తుంటారు కాబట్టి, వారినే నన్ను వేధించడానికి ఎంచుకున్నారు. రాష్ట్రాల పరిధిలోని పోలీసులు ఆ రాష్ట్ర ప్రభుత్వం కింద పని చేస్తుంటారు’’
‘‘2000 ఏడాదిలో వాజ్ పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో ఓ గెజిట్ ఇచ్చారు. రాజ్యాంగంపై సమీక్షించాలని వాజ్ పేయీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. రాజ్యాంగాన్ని మార్చడానికి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ ను వేశారు. 2002లో వెంకటాచలయ్య కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో వెంకటాచలయ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. అప్పుడు ఇచ్చిన నివేదిక ఇప్పుడు అందుబాటులో లేదు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రాజ్యాంగాన్ని మార్చే అవకాశం బీజేపీకి లేకుండా పోయింది. ఎస్సీలకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రం కావాలని ఆర్ఎస్ఎస్ రెండో సర్‌సంఘ్ చాలక్ గోల్వాల్కర్ రాశారు. కానీ దళితులకు కూడా సమాన హక్కులు ఇచ్చారని గోల్వాల్కర్ రాశారు. పదేళ్ల తర్వాత రిజర్వేషన్లు తొలగించాలని 2015లో గోల్వాల్కర్ సూచించారు. ఇప్పుడు రిజర్వేషన్ల రద్దుకు యత్నిస్తున్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లు సరికాదని 2015లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎన్‌జీ వైద్య పత్రికల్లో వ్యాసాలు రాశారు’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. క్రమంగా ఒక్కో రాష్ట్రంలో బీజేపీ బలవంతంగా అధికారంలోకి వచ్చిందని.. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే వాటిని పడగొట్టి దాదాపు 8 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే ఇది
‘‘రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆరెస్సెస్ మూల సిద్ధాంతం. ఆరెస్సెస్ రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. రిజర్వేషన్లు కాపాడడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఆరెస్సెస్ విధానాలపై నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను. నరేంద్రమోదీ కన్వర్టెడ్ బీసీ. అందుకే ఆయనకి బీసీలపై ప్రేమ లేదు. రిజర్వేషన్లు తొలగించాలని ఆరెస్సెస్ వందేళ్ల క్రితమే టార్గెట్ పెట్టుకుంది. రాజ్యాంగాన్ని సవరించాలి రిజర్వేషన్లు రద్దు చేయాలనేదే బీజేపీ లక్ష్యం. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ముఖ్యమంత్రిపై కేసులు పెడుతారా? నన్ను ఎన్నికల ప్రచారం చేయకుండా బీజేపీ ప్రయత్నిస్తోంది. అమిత్ షా, మోదీ తమ పోలీసులతో నన్ను బెదిరించడం సాధ్యపడని విషయం.
రాజ్యాంగం మార్చడానికే వచ్చామని కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డే ప్రకటించారు. లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ రిజర్వేషన్లు అభివృద్ధికి ఉపయోగపడుతాయా అని మాట్లాడారు. ఎన్నికలకు ఇబ్బంది అవుతుందనే నేను మాట్లాడే విషయాలను పక్కదోవ పట్టిస్తున్నారు. నిజాలు మాట్లాడుతున్నందుకే నాపై డిల్లీలో అక్రమ కేసులు పెట్టారు. నేను మాట్లాడేది నాకోసమో, నా పార్టీ కోసమో కాదు.
నేను మాట్లాడే విషయాలపై మోదీ, అమిత్ షా వాళ్ళ పార్టీ విధానాన్ని తెలిపదానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఢిల్లీ పోలీసులు వస్తే మాట్లాడడం మానేస్తానని అనుకుంటున్నారేమో? బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు మద్దతు ఇచ్చినట్టే. ఈ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అనే చర్చ పక్కన పోయింది. ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు బీసీ ఈ కింద ఇస్తున్నారు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.