Cm Revanth Reddy Sensational Comments: ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం (మే 1న) సాయంత్రం 5 గంటలకు బీజేపీ (Bjp) కుట్రలను బయటపెడతానంటూ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడారు. గుజరాత్ నుంచి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడి ముఖ్యమంత్రిని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ బెదిరించి భయపెట్టిన నిజాం, రాజాకార్లను ఇక్కడి ప్రజలు తరిమికొట్టారని తెలిపారు. 'బలహీన వర్గాలకు దక్కాల్సిన నిధులు, అవకాశాలు రాలేదు. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి. ఈ అంశంపై నేను ప్రశ్నించాను. దీనిపై మోదీ, అమిత్ షా ఢిల్లీలో కేసు పెట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు.. ఢిల్లీ పోలీసులతోనే భయపెట్టాలని చూస్తున్నారు. ఈ కేసులకు రేవంత్ భయపడడు. మీ దగ్గర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండొచ్చు. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు. మోదీ గుజరాత్ వ్యక్తిలా వచ్చి మనల్ని తిట్టారు. శపించారు. 5 రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు ఐదేళ్లైనా ఇవ్వలేదు. 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఎన్నో ఆటు పోట్లు చూశాను. గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేద్దామనుకుంటున్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోటీ. ప్రెస్ మీట్ పెట్టి ఈ కుట్రలను బయటపెడతాను. రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తుందో వివరిస్తా. రాష్ట్రపతి ప్రసంగంలోనే రాజ్యాంగం మార్పు అంశాన్ని చేర్చారు. దీనికి సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తాను.' అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
'అందుకు కేసు పెడతారా.?'
'ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు నాపై కేసా.? గుజరాత్ నుంచి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా.? ప్రధాని మోదీ భయపెడితే భయపడడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు.' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల అండతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు గతం కంటే చాలా భిన్నమని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో బీజేపీ గెలవాలని చూస్తోందని.. తద్వారా దేశాన్ని అమ్మోయాలని చూస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీ పోలీసులకు రిప్లయ్
రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా వీడియోను సర్క్యూలేట్ చేశారన్న అభియోగంపై ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పీసీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేసినందున విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకటో తేదీన రావాలని అందులో పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి విచారణకు ఢిల్లీకి వెళ్లలేదు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై పీసీసీ లీగల్ సెల్ నేతలు సమాధానం పంపించారు. ఈ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల సమయం కావాలని కాంగ్రెస్ లీగల్ సెల్ లేఖలో కోరింది. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి లోకసభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారని.. ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉండడంతో విచారణకు రాలేమని సమాధానం పంపారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.
Also Read: Delhi Police : ఆ ట్విట్టర్ ఖాతా నాది కాదు - ఢిల్లీ పోలీసులకు రిప్లయ్ పంపిన రేవంత్ రెడ్డి