ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిన అంశంపై క్రమంగా ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేత, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్ తాజాగా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడుతూ.. బీజేపీ ఈ అరెస్టును ఖండిస్తుందని అన్నారు. చంద్రబాబు నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా అరెస్టు చేశారని, ఎఫ్ఐఆర్‌లో పేరు లేకపోయినా కూడా అరెస్టు చేశారని అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్​ జైలుకి పోలీసులు తరలించిన సంగతి తెలిసిందే. 


జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు జరపడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. పార్లమెంట్ ​లో బిల్లు పెట్టి అందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. మార్చి లేదా ఏప్రిల్​లో లోక్ ​సభ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్​ లేదా డిసెంబరు​లో జరుగుతాయని కె.లక్ష్మణ్ వివరించారు.


నిరుద్యోగులపై పోరాటం
నిరుద్యోగుల వైపు పోరాటాన్ని బీజేపీ ఉధృతం చేసిందని, ఈనెల 13న జాబ్ క్యాలెండర్ విడుదల, ఖాళీల భర్తీ చేయాలంటూ 24 గంటల పాటు దీక్ష చేపడుతున్నామని కె.లక్ష్మణ్ వెల్లడించారు. 13న ఇందిరా పార్కు వేదికగా 11 గంటలకు దీక్ష ప్రారంభం అవుతుందని వివరించారు. యువత పెద్ద సంఖ్యలో హాజరై దీక్షను విజయవంతం చేయాలని వెల్లడించారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పేద ప్రజలకు కానుకగా ఇవ్వబోతున్నామని వెల్లడించారు.


పాపం బాబు అరెస్టయ్యారు: హరీశ్ రావు


తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా బాబు అరెస్టుపై స్పందించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణకు చెందిన మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. పాపం చంద్రబాబు నాయుడు అరెస్టైనట్టున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కేసీఆర్ పాలనలో వ్యత్యాసాన్ని వివరించారు.


తన నియోజకవర్గం సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు ఐటీని దేశంలో అగ్రగ్రామిగా నిలిపానని చెప్పుకునేవారు. పాపం ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు అయినట్టున్నారు. దాని గురించి మాట్లాడకూడదు అని అన్నారు. కానీ గతంలో ఆయన ఎప్పుడూ ఐటీ ఐటీ అని ప్రస్తావించేవారని హరీశ్ రావు గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ లో ఐటీ రంగం మరింత అభివృద్ధి జరిగిందన్నారు. అదే సమయంలో పల్లెల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది.. దటీజ్ కేసీఆర్ రూలింగ్ అని వ్యాఖ్యానించారు.


దేశంలో బెంగళూరును ఐటీకి సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు, కానీ ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం తొలి స్థానంలో ఉందన్నారు. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్రంలో 3 లక్షల ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు పది లక్షల మంది ఉన్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. ఓ వైపు ఐటీ ఉత్పత్తులు, ఎగుమతులు పెరగడంతో పాటు పల్లెల్లో వ్యవసాయం బాగా జరిగి, ధాన్యాల ఉత్పత్తిలోనే దేశంలో మెరుగైన స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు.


ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్‌ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్ర బాబును కోర్టులో హాజరు పర్చినప్పుడు సీఐడీ అధికారులు కేసుకు సంబంధించిన రికార్డులు, 700 పేజీలలో సమర్పించారని నివేదికలో తెలిపింది.