Rajasingh : తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. తాను ఎట్టి పరిస్థితిలో టిడిపి పార్టీలో చేరే లేదని స్పష్టంచేశారు .తాను బిజెపి పార్టీలో ఉంటానని రానున్న ఎన్నికల్లో బిజెపి పార్టీ నుంచే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరో సారి పోటీ చేస్తానన్నారు. నా మెంటాలిటీ కి బీజేపీ తప్ప ఏ పార్టీ లు షూట్ కావు… ఎవరు తీసుకోరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వెళ్ళలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నా మీద సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తెస్తారో తెలియదన్నారు. బండి సంజయ్, కేంద్ర మంత్రులు ,బీజేపీ నేతలు తన వెనుక ఉన్నారని రాజాసింగ్ తెలిపారు. అయితే ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసి ఆరు నెలలు దాటిపోయింది. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా సస్పెన్షన్ వేటు ఎత్తి వేయడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి పోటీ చేయాలంటే... సస్పెన్షన్ వేటువేసినందున బీజేపీ టిక్కెట్ ఇవ్వదని అనుకుంటున్నారు. అందుకే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది.
టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాజాసింగ్
రాజాసింగ్ 2009లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్‌గౌడ్‌పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఆరు నెలల కిందట సస్పెన్షన్ వేటు వేసిన బీజేపీ
ఓ స్టాండప్ కమెడియన్ హైదరాబాద్ షోను భారీ భద్రత మధ్య ఏర్పాటు చేసినందుకు నిరసనగా రాజాసింగ్ ఓ వివాదాస్పద వీడియో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో తీవ్రదుమారం రేపింది. రాజాసింగ్ ను బీజేపీ నుండి సస్పెండ్ చేశారు. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. దీంతో చాలా కాలం జైల్లో ఉండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తనపై వచ్చిన వివాదాలు.. కేసుల విషయంలో పార్టీ హైకమాండ్‌కు వివరణ ఇచ్చారు. ఎప్పటికప్పుడు రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తి వేస్తారని చెబుతూ వస్తున్నారు కానీ ఎత్తి వేయడం లేదు. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది.
కాసాని జ్ఞానేశ్వర్ ను కలిసినట్లుగా ప్రచారం!
ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు పెంచింది. టీ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమాకం తర్వాత పలువురు నేతల్ని చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ కూడా కాసాని జ్ఞానేశ్వర్‌ను వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపినట్లుగా ప్రచారం ఊపందుకుంది. టీడీపీలో చేరిన తర్వాత గోషామహల్ నియోజకవర్గంతోపాటు మరో మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని రాజాసింగ్ పార్టీ అధినేతలకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ తరపునే పోటీ చేస్తానని రాజాసింగ్ చెబుతున్నారు. కానీ సస్పెన్షన్ లో ఉన్న రాజాసింగ్ కు బీజేపీ టిక్కెట్ ఎలా కేటాయిస్తుందన్న ప్రశ్న రాజకీయవర్గాలు వేస్తున్నాయి. అయితే రాజాసింగ్ లాంటి నాయకుడ్ని బీజేపీ వదులుకోదని రేపోమాపో సస్పెన్షన్ ఎత్తి వేస్తారని చెబుతున్నారు.