టైటానిక్ అతి పెద్ద ఓడ. అది మునిగిపోవడం ఒక విషాద ఘటన. ఇందులో దాదాపు 1500 మంది మరణించారు. కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. నిజంగా జరిగిన ఈ సంఘటనను సినిమాగా తీస్తే బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోయింది. ఇప్పటికీ టైటానిక్ అంటే ఎంతో ఆసక్తి. దాని గురించిన విషయాలు తెలుసుకోవాలని గూగుల్ లో శోధించే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పుడు టైటానిక్ ఓడకు సంబంధించి ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. టేస్ట్ అట్లాస్ అనే వెబ్సైట్ టైటానిక్ ఓడలో విషాద ఘటన జరగడానికి ముందు ప్రయాణికులు ఏం తిన్నారు, వాళ్ళ మెనూ ఎలా ఉండేది వంటి అనే విషయాలను ప్రచురించింది.
మొదటి ప్రయాణమే...
టైటానిక్ తన మొదటి ప్రయాణంలోనే మునిగిపోయింది. తనతో పదిహేను వందల మందిని సముద్ర గర్భానికి లాక్కెళ్లిపోయింది. 1912లో ఏప్రిల్ 14న ఓ మంచు పర్వతాన్ని ఢీ కొని నౌక రెండు ముక్కలుగా విరిగిపోయింది. 2240 మందితో ప్రయాణమైంది ఈ ఓడ. ప్రయాణం ప్రారంభించిన రెండు రోజులకే ఈ విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లాండులో మొదలైన దీని ప్రయాణం న్యూయార్క్ నగరం వరకు సాగాలి. కానీ మధ్యలోనే అంతమైపోయింది.
టైటానిక్ ఓడలో ప్రయాణికులను మూడు తరగతులుగా విభజించారు. అత్యంత ధనవంతులను మొదటి తరగతిగా, మధ్యతరగతి వారిని రెండో తరగతిగా, పేదవారిని మూడో తరగతి గా విభజించారు. వారికి కేటాయించే గదులు, అందించే సేవలు కూడా వారి తరగతులకు తగ్గట్టే ఉన్నాయి. అలాగే ఆహారం కూడా ఒక్కో తరగతికి, ఒక్కోలా విభజించి పెట్టారు. ఇందులో మొదటి తరగతుల ప్రయాణికులకు ఫఫిల్లెట్‌లు, కూరగాయలు, కార్న్డ్ బీఫ్, గ్రిల్డ్ మటన్ చాప్స్, కస్టర్డ్ పుడ్డింగ్, చికెన్ ఎ లా మేరీల్యాండ్, గాలంటైన్ ఆఫ్ చికెన్, పాటెడ్ రొయ్యలు, జున్ను వంటివి అందించారు.
రెండవ తరగతికి యార్మౌత్ బ్లోటర్స్, అమెరికన్ డ్రై హాష్ ఔ గ్రాటిన్, గ్రిల్డ్ హామ్, ఫ్రైడ్ ఎగ్స్, వియన్నా, గ్రాహం రోల్స్, బుక్‌వీట్ కేక్స్, గ్రిల్డ్ ఆక్స్ కిడ్నీలు, బేకన్‌లతో పాటు రోల్డ్ ఓట్స్, బాయిల్డ్ హోమినీ, సోడా స్కోన్‌లు ఇచ్చారు.
థర్డ్ క్లాస్ ప్రయాణికులకు గంజి, రోస్ట్ బీఫ్, ఉడికించిన బంగాళదుంపలు, బ్రౌన్ గ్రేవీ, రైస్ సూప్, క్యాబిన్ బిస్కెట్లు, స్వీట్ కార్న్‌తో పాటు తాజా బ్రెడ్, వెన్న, స్మోక్డ్ హెర్రింగ్‌లు, జాకెట్ పొటాటోస్, హామ్, గుడ్డు, స్వీడిష్ బ్రెడ్ అందించారు. . కోల్డ్ మీట్, ఉడికిన అత్తి పండ్లు కూడా ఇచ్చారు.
రెండో తరగతిలో ప్రయాణించిన వారు ప్రమాదం జరగడానికి కాసేపు ముందు ప్లమ్ పండ్లతో చేసిన పుడ్డింగ్ ను ఆరగించారని టేస్ట్ అట్లాస్ ద్వారా తెలుస్తోంది.
Also read: మామిడిపండును తిన్నాక నీళ్లు తాగితే ఇలా జరిగే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.