BJP Leader Raghunandan Rao Sensational Comments: సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అనుమతితోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందరన్ రావు (Raghunandan Rao) అన్నారు. మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంపై ఆయన స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ స్థానం కోసం కవిత పట్టుబడుతున్నారని.. అందుకే జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారని అన్నారు. పార్టీలో బావ బావమరుదులకు పడడం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారనే.. వారితో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని మండిపడ్డారు. సీట్లు అమ్ముకోవడం, దండుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాల అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఓటమి కోసం తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ పైనా విమర్శలు


ఒకప్పుడు ఎవరు ఏది చేస్తే అదే వారికి తిరిగి వస్తుందనడానికి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడమే నిదర్శనమని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. మెజార్టీ ఉన్నప్పటికీ అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని.. వాటిని చీల్చడానికి బీఆర్ఎస్ కు ఏడేళ్లు పడితే.. కాంగ్రెస్ పార్టీకి 7 నెలలు కూడా పట్టలేదని అన్నారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ జీరో కావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్ అంటే ఏంటో నిన్నటివరకూ గుర్తు రాలేదా.? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. 2009లో అధ్యక్ష పీఠం కోసం జరిగిన కొట్లాట ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ లో రిపీట్ అవుతోందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 16 సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు 90 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడే లోక్ సభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కు పరిమితమైందని.. ఇప్పుడు ఎన్నికల్లో 12 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు.


ఇదీ జరిగింది


కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy), నర్సాపూర్ ఎమ్మెల్యే (Narsapur MLA) సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు మంగళవారం సాయంత్రం సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వారు పార్టీ మారనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై ఆ నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తాము పార్టీ మారే ప్రసక్తే లేదని.. కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.


Also Read: TS Universities: తెలంగాణ వర్సిటీలకు వీసీల నియామకం, ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం!