ఉప ఎన్నిక... బై ఎలక్షన్స్... 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాగా తెలంగాణలో బాగా వినిపిస్తున్న పదం. ఉప ఎన్నిక రాగానే ఆ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిపోతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణలో ఏదైనా నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చిన ప్రతిసారి అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ నేతలు వరాలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జనం మెప్పు చూరగొనేందుకు నేతలు అనేక హామీలను ఇచ్చారు.


నీటి పారుదల ప్రాజెక్టుల నుంచి రోడ్లు, ప్రభుత్వ కాలేజీల వరకూ ఉప ఎన్నికలకు ముందు మంజూరు చేశారు. తాజాగా హుజూరాబాద్ స్థానం ఖాళీ కావడంతో అక్కడ కూడా నిధుల వరద కురుస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. ఇందుకోసం దళిత బంధును ఆ నియోజకవర్గంలో తొలుత ప్రవేశపెడతామని ప్రకటించారు. 


ఇలాంటి పరిస్థితుల్లో విపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు సామాజిక మాద్యమాల్లో ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. ఫలానా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉప ఎన్నికలు వస్తే సరిపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఖాళీ అయిన స్థానంలో మళ్లీ గెలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి.. సాధారణంగా జనం మెచ్చే కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేయాల్సిందే. కాబట్టి, ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులను మంజూరు చేయిస్తారని విపరీతంగా ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఎమ్మెల్యేలు రాజీనామా చేసేస్తే మళ్లీ ఉప ఎన్నిక ఉంటుందనే ఉద్దేశంతో తమ ప్రాంతంలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని ఎద్దేవా చేస్తున్నారు.


రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు


సోషల్ మీడియా ప్రచారంతో పాటు భువనగిరి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి ఒక అడుగుగు ముందు వేశారు. ఇందుకోసం ఆయన కేవలం సోషల్ మీడియాతో మాత్రమే ఆగిపోలేదు. ఏకంగా ఆయన భువనగిరి నియోజకవర్గంలో భారీ ఫ్లెక్సీలను రూపొందించి పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ‘‘ఎమ్మెల్యే సారూ.. రాజీనామా చెయ్..’’ అంటూ భారీ అక్షరాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ భువనగిరిలో హాట్ టాపిక్‌గా మారింది. ‘‘బెడిసికొడుతున్న టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్న ప్రజలు. భువనగిరి ఎమ్మెల్యే గారూ.. రాజీనామా చేయండి. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు రావాలంటే మీరు రాజీనామా చేయాల్సిందే’’ అంటూ ఫ్లెక్సీలో ముద్రించారు.


మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆగస్ట్ 9 నుంచి దళిత దండోరయాత్ర ప్రారంభిచనున్నట్లు, ప్రతి నియోకవర్గంలో ఎమ్మెల్యేలను నిలదీసి, అందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని తాజాగా ఏబీపీ దేశంకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సో.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్ మరింత పెరిగే ఉండే అవకాశం ఉంది. 


అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం దళిత బంధు పథకం ప్రకటించింది ఇప్పుడు కాదనీ, గతంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారని గుర్తు చేస్తున్నారు.  బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒక్కసారి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలు వెనక్కి వెళ్లి చూసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.