Eatala Rajendar :   బీజేపీలో సీనియర్ నేత ఈటల రాజేందర్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం ఆయన పట్టుబడుతున్నారని ఇవ్వకపోతే పార్టీకి  గుడ్ బై చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.    అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.  ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో ఈటెల రాజేందర్ దేశంలోనే అతి పెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై గురిపెట్టారని తెలుస్తోంది. మరోవైపు ఈటలతో పాటు బీజేపీ నుంచి ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నేతలు క్యూ కడుతున్నారు.                                             


అయితే నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేత పైడి రాకేష్ రెడ్డికి పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇది వరకే అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటల.. తీవ్ర పోటీ ఉన్న ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పైనే గురిపెట్టడంతో పార్టీలోని ఇతర ఆశావాహులకు నచ్చడం లేదు.  అధిష్టానం ఈ పార్లమెంట్‌‌లో గెలవాలని భావించి.. ఫోకస్ పెంచింది. ఈ  అక్కడే పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. రెండు చోట్ల ఓడిపోయిన ఈటల ఈ స్థానం కాకుండా మెదక్ ఇతర స్థానాల్లో పోటీ చేయాలని ఆయకు పార్టీ నేతలు సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం.


ఈటల రాజేందర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మల్కాజ్‌గిరిలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.  వివిధ కార్యక్రమాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అధిష్టానానికి సంకేతాన్ని పంపుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఈటల ఫర్ మల్కాజ్‌గిరి’ క్రికెట్ ట్రోఫీని ఆయన అనుచరులు స్టార్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా స్వయంగా తన నివాసంలో ఈటల రాజేందర్ రిలీజ్ చేశారు. ఈటలకే మల్కాజ్‌గిరి టికెట్ రాబోతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో మరోసారి ఈటల దుమారం తెరపైకి వచ్చింది.       


ఎంపీగా పోటీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం కంటే ముందే అనుచరుల పేరుతో తానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై పార్టీ నేతలు హైకమండ్ కు పిర్యాదులు చేశారు. ఇప్పటికి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినా పార్టీ పరిస్థితి మెరుగుపడలేదు. ఈటల సూచనల మేరకే బీసీ సీఎం నినాదాన్ని అందుకున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఈటలకు సీటు కేటాయించకపోతే..బీజేపీలో రాజీనామాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.