Telangana Rajya Sabha elections were unanimous :  కాంగ్రెస్ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత దీపాదాస్ మున్షీ సమక్షంలో వారు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. వారు మూడు సెట్లుగా నామినేషన్ వేశారు.  


మూడు స్థానాలకు మూడు నామినేషన్లు                                


కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవి చంద్ర రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగిసింది. రేపు నామినేషన్లు పరిశీలన ఉంటుంది. 20వ తేదీన ఉపసంహరణ, 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయి. అయితే మూడు స్థానాలకు మూడు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవం అవుతాయి. ఇక ఎలాంటి ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. 


మూడో స్థానానికి పోటీపై ఆలోచన చేయని కాంగ్రెస్                                


మూడో స్థానానికి కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకపోవడంతో ఏకగ్రీవం అయింది. బీజేపీ, మజ్లిస్ పార్టీలకు కలిపి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు  పార్టీలకు పోటీ చేయడానికి సరి పడా బలం లేదు. ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వవు. అయితే మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు అంగీకిరిస్తే మూడో  స్థానానికి  కాంగ్రెస్ పెడుతుందన్న ప్రచారం జరిగింది. అయితే అలా చేసినా ఎమ్మెల్యేల ఫిరాయింపు దారులే గెలిపించాల్సి ఉంటుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఇలాంటి ఫిరాయింరపుల గురించి జాగ్రత్త తీసుకోవాలనుకున్న  కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 


ఏపీలోనూ మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం                       


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్ర‌తిప‌క్ష టీడీపీకి 23 మంది. అయితే ఇందులో విశాఖ ఉక్కు ప్రైవైటీక‌ర‌ణ‌ను నిర‌సిస్తూ గంటా శ్రీ‌నివాస‌రావు రాజీనామా చేయ‌డంతో టీడీపీ బ‌లం 22కి ప‌డిపోయింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే 44 మంది ఎమ్మెల్యేల మ‌ద్దతు కావాలి. అందులో స‌గం బ‌లం మాత్ర‌మే ఉండ‌టంతో  టీడీపీ పోటీ చేయాలని అనుకోలేదు.   దీంతో వైసీపీ నుంచి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పారిశ్రామిక‌వేత్త మేడా ర‌ఘునాథ‌రెడ్డిలు నామినేష‌న్లు వేశారు. టీడీపీ పోటీచేయ‌క‌పోవడంతో ఈ ముగ్గురూ ఏక‌గ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమే !