Munugode BJP : మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ హైకమాండ్  ఆ నియోజకవర్గానికి సంబంధించి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామిని ఆ కమిటీ  ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్టీరింగ్ కమిటీలో మరో 14 మంది సభ్యులుగా వ్యవహరించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ కో ఆర్డినేటర్గా నియమించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులగా కీలక నేతలను నియమించారు.


స్టీరింగ్ కమిటీ సభ్యుల పేర్లు 


1. ఈటల రాజేందర్, ఎమ్మెల్యే,  


2. జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ
3. గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ
4. విజయ శాంతి, మాజీ ఎంపీ
5. దుగ్యాల ప్రదీప్ కుమార్, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ
6. స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ
7. చంద్ర శేఖర్, మాజీ మంత్రి
8. ఎండ్ల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే
9. రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ
10. రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎంపీ
11. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
12. కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ
13. టి. ఆచారి, నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
14. దాసోజు శ్రవణ్


ప్రతీ సారి జితేందర్ రెడ్డికి ఈ సారి వివేక్‌కు చాన్స్ 


బీజేపీ గత రెండు ఉపఎన్నికల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బాధ్యతలను ఇచ్చింది. దుబ్బాకతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నికలను కూడా జితేందర్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. ఆ రెండు చోట్లా విజయం సాధించింది. ముందు నుంచీ ఆయనకు లక్కీ హ్యాండ్‌గా పేరు ఉంది. ఆయన బాధ్యత తీసుకుంటే విజయం ఖాయమని అనుకున్నారు. కానీ ఈ సారి మాత్రం మాజీ ఎంపీ  వివేక్‌కు బాధ్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండే అవకాశం ఉండటంతో.. ఈ సారి దళిత నేతకు ఎన్నికల బాధ్యతల ఇవ్వాలని హైకమాండ్ అనుకుంది. ఆ మేరుక నిర్ణయం తీసుకున్నట్లుగా  తెలుస్తోంది. 


నవంబర్‌లో మునుగోడులో ఎన్నికలు జరిగే అవకాశం


మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ నెలలో వస్తుందని ఎన్నిక నవంబర్‌లో జరుగుతుందని రాజకీయవర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. దానికి తగ్గట్లుగా మునుగోడులో రాజకీయ కార్యకలాపాలు పెంచుతున్నాయి. ఎప్పటికప్పుడు బలాలను బేరీజు వేసుకుంటూ... కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ కూడా..  తెలంగాణలోని కీలక నేతలందర్నీ రంగంలోకి దింపినట్లుగా కనిపిస్తోంది. 


అందరి చూపు మునుగోడు వైపే 


తెలంగాణ రాజకీయ పరిస్థితులని మార్చే ఉపఎన్నిక కావడంతో అందరి చూపు మునుగోడు వైపే ఉంది.  కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖారరు చేసింది. పాల్వాయి స్రవంతిని అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించడం ఖాయమే. అయితే ఆయనపై క్యాడర్‌లో అసంతృప్తి ఉండటంతో  ..  గ్రామాల వారీగా ఆత్మీయ సమావేశాలు పెట్టి వారి మద్దతును కూడగట్టిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.