Telangana BJP : తెలంగాణ బీజేపీలో సీనియర్ల అసంతృప్తిని తగ్గించేందుకు హైకమాండ్ చర్యలు ప్రారంభించింది. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనకుండా మౌనం పాటిస్తున్న సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి రావాలని పిలిచింది. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో హైకమాండ్ వారిని పిలిచి  మాట్లాడాలని నిర్ణయించుకుంది. 


కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో గందరగోళం                  


తెలంగాణ బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. అగ్రనేతల పర్యటనలు వాయిదా పడటం.. పార్టీల్లో చేరికలు లేకపోవడం.. కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ప్రచారంతో ఎక్కువ మంది సీనియర్లు సైలెంట్ అవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు.  బీజేపీ 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా   ఇంటింటికీ బీజేపీ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు  బీజేపీ నేతలు గురువారం ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలన కలవాలనుకున్నారు.  పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలస్తున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం  దూరంగా ఉన్నారు. 


బీజేపీ కార్యక్రమాల్లో కనిపించని ఈటల. రాజగోపాల్ రెడ్డి                                          


ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టలేదు. అలాగే మరికొంత మంది కీలక నేతలు కూడా అంతే అసంతృప్తితో ఉన్నారు. యెన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి వారు కూడా దూరంగా ఉన్నారు. వీరు ఇన్ యాక్టివ్ కావడంతో  బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ పాలనా విజయాలపై చేపట్టిన కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొంటారని అనుకున్నారు. కానీ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న వారే పాల్గొనకపోవడంతో తెలంగాణ బీజేపీ గురించి ఢిల్లీ అగ్రనేతలు ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. 
 


తెలంగాణ బీజేపీ పై దృష్టి సారించలేకపోతున్న హైకమాండ్ 


ఈటల రాజేందర్  కొంత కాలగా బీజేపీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ ను ఓడించే పార్టీ బీజేపీనేనని నమ్మి పార్టీలో చేరారు.కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్న భావనలో ఉన్నారు. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో నే ఉండనున్నారు. రాజగోపాల్ రెడ్డి  మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తారని ఆయన చెబుతున్నారు. మరో ైపు తెలంగాణ బీజేపీపై హైకమాండ్ దృష్టి సారించలేకపోతోంది. అగ్రనేతల పర్యటనలు రద్దు అవుతున్నాయి.   అదే సమయంలో పార్టీ నేతల్లో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తాజాగా ఈటల ,  రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ చర్చలతో పరిస్థితి సద్దుమణుగుతుందేమో చూడాల్సి ఉంది.





Join Us on Telegram: https://t.me/abpdesamofficial