బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. బీసీ విద్యార్థులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండేళ్లుగా చెల్లించలేదని చెప్పారు. సుమారు రూ.3 వేల కోట్లు బకాయి పడినట్లు పేర్కొ్న్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ  అనుభవిస్తున్నారని అన్నారు.


ఫీజులు చెల్లించకపోవడంతో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. ఈ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాలు వీడిపోక ముందు.. ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజులు ఎంత ఉంటే అంత ప్రభుత్వమే చెల్లించేదని చెప్పారు. 


టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడిచిందని బండి సంజయ్ అన్నారు. 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తున్నారని.. ఆపై ర్యాంకు వచ్చిన వారికి రూ.35 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు.


బండి సంజయ్ లేఖ


‘‘తెలంగాణలో గత మూడేళ్లలో ఒక్క రైతు పొలంలోని మోటారుకు మీటరు బిగించినట్లు నిరూపించగలరా? లేదంటే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? ఎరువుల సబ్సిడీ పేరిట తెలంగాణ రాష్ట్రానికి ఏడేళ్లలో కేంద్రం వేల కోట్లు ఖర్చు చేసింది నిజం కాదా? మీరు చేసిందేంటి? అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరకుల కొరత వల్ల ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగినా వీటిని కేంద్రం పాత ధరలకే సరఫరా చేస్తోంది. 2014తో పోలిస్తే ప్రస్తుతం వరి, గోధుమలు సహా 23 రకాల పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధర 50-100 శాతం పెరిగింది. పొరుగు రాష్ట్రాలు రైతులకు బోనస్‌ పేరిట క్వింటాకు రూ.200-600 వరకు చెల్లిస్తుండగా.. తెలంగాణలో నయాపైసా ఇవ్వట్లేదు.’’



‘‘ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించేందుకు కేంద్రం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో కమిటీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క సిఫార్సూ ఎందుకు చేయలేదు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదు. కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది. 19 రాష్ట్రాలూ పన్నులు తగ్గించాయి. తెలంగాణలో మాత్రం పైసా కూడా తగ్గించలేదు. పంటలకు మద్దతు ధర ఎలా నిర్ణయిస్తారో తెలియని అజ్ఞాని సీఎం. రైతుబంధు ఒక్కటిచ్చి మిగతా సబ్సిడీలను ఎత్తేసింది నిజం కాదా? ఏడేళ్లుగా పంట బీమాను అమలు చేయలేదన్నారు. రైతుల పాలిట రాబందుగా మారిన కేసీఆర్‌ రైతు బంధునంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. నిజంగా రైతుబంధే అయితే అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఎందుకుంది?’’ అని బండి సంజయ్ లేఖ రాశారు.