TSPSC Politics : తెలంగాణ రాజకీయాల్లో టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం సంచలనం అవుతోంది. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు బయటపడగానే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన రాజకీయ వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ పార్టీ కార్యకర్త అని కేటీఆర్ రిట్వీట్ చేశారు. ఈ విషయంలో తగిన దర్యాప్తు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు. రాజకీయ పార్టీగా బీజేపీ అత్యంత దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని, ప్రస్తుత పరిణామం ఆ పార్టీ మరింత దిగజారుడు రాజకీయా లకు నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు బీజేపీ పార్టీ నిరుద్యోగ యువత భవిష్యత్‌ను ఫణంగా పెట్టి కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తగిన విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డీజీపీని కోరారు. ఈ లీకేజీ విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆరేనని టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే.. మరి ఆయనను బర్తరఫ్ చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై జరిగిన పోరాటంలో అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉంటున్న బీజేవైఎం నాయకులను గురువారం బండి సంజయ్ పరామర్శించారు. అసలు పేపర్ లీకేజీ ఎట్లా అయింది..? టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌కు తెలియకుండా ఎట్లా లీకైంది..? ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలన్నారు. నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారు. మియాపూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్‌లు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండే. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ కొడుకు పాత్ర క్లియర్‌గా ఉంది. ఐటీశాఖ ఫెయిల్యూర్ ఉంది. అయినా కేసీఆర్ ఏమీ మాట్లాడటం లేదు. కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే కొత్త డ్రామా చేస్తున్నారని విమర్శించారు.
పైగా బీజేపీ పాత్ర ఉందని సిగ్గు లేకుండా ఆరోపిస్తున్నారు.. రాజశేఖర్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడని అంటున్నారు.. 2017 నుంచి అతను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఉద్యోగి. ఐటీశాఖ పరిధిలో ఉంటుంది. మరి ఇన్నాళ్లు ఏం చేస్తున్నట్లు..? అట్లాంటివాళ్లను గుర్తించడం చేతగాని నువ్వు మంత్రిగా ఉండటానికే అనర్హులు అని మండిపడ్డారు. అదే్ సమయంలో మరో నిందితురాలు రేణుకా రాథోడ్ తల్లి బీఆర్ఎస్ సర్పంచ్ అన్న విషయాన్ని బండి సంజయ్ ట్వీట్ ద్వారా తెలిపారు.
పరీక్షలు కూడా నిర్వహించలేని చేతగానితనం కేసీఆర్ సర్కార్‌దంటూ ఫైర్ అయ్యారు. కనీసం టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించడం చేతగావడం లేదని విమర్శించారు. దొంగ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తంగా పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నాయి.