Allu Arjun Father In Law Joined Congress : తెలంగాణలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతల ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. తనకు బీఆర్ఎస్ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన సొంతగూటికి చేరానని .. గతంలో యూత్ కాంగ్రెస్ లో పనిచేశానని చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హైదరాబాద్ శివార్లలో ఇబ్రహీంపట్నం లేదా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ చాన్స్ లభించలేదు.
ఇటీవల ఎన్నికల్లో నాగార్జున సాగర్ టిక్కెట్ ఆశించారు. తనకు టిక్కెట్ ఇస్తే.. తన అల్లుడు అల్లు అర్జున్ కూడా ప్రచారం చేస్తారని మీడియా ఇంటర్యూల్లో చెప్పారు. అయితే ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. ఆయన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా.. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటిస్తానని చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు.
హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జడ్ పి చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బొంతు రామ్మోహన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్ని బిఆర్ఎస్ నుంచి హైదరాబాద్ మేయర్ గా సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉప్పల్ నియోజకవర్గం సీటు ఇవ్వాలని బిఆర్ఎస్ అధిష్టానాన్ని అడిగినా ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బొంతు కాంగ్రెస్ లో చేరారు.
జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య కూడా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో రెండు సీట్లకే పిరమితమయింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల నాటికి పుంజుకోవాలన్న లక్ష్యంతో ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తున్నారు. చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీలో చేరిన వారిలో పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్లే నుంచి పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
పార్టీలో చేరిన తర్వాత నేతలు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు.