Rajadhani Files : ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.సీఎం జగన్, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని.. గతేడాది డిసెంబర్ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో ఏపీలో సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లపై రెవిన్యూ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించి అప్పటికప్పుడు ప్రదర్శన నిలుపుదల చేయించారు.
ఈనెల 15న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. విడుదలను నిలిపివేయాలంటూ హైకోర్టు గురువారం స్టే విధించిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు (గురువారం) సినిమా నిర్వహకులు.. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లను కోర్టుకు సమర్పించారు. దీంతో అన్ని సక్రమంగానే ఉన్నాయని, సినిమా విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ హైకోర్టు తేల్చిచెప్పిం. ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని భానుప్రకాశ్ తెరకెక్కించగా.. కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు.
రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను నిలువరించాలంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని, సెన్సార్ బోర్డు జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని అప్పిరెడ్డి కోరారు. చిత్రంలోని పాత్రలు ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని, తదితరులను పోలి ఉన్నాయని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. . వైఎస్సార్‌సీపీని చులకన చేయాలనే ఉద్దేశంతో ఈ మూవీని నిర్మించారని ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్మించారన్నారు.
ఈ సినిమాలో కించపరిచేలా సన్నివేశాలు లేవని సినిమా నిర్మాతల తరఫున లాయర్ వాదించారు. ఇప్పటికే ఈ మూవీ పరిశీలించిన కమిటీ కొన్ని సన్నివేశాల తొలగింపునకు సూచించగా, తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామన్నారు. ఆ కమిటీ సూచించిన మేరకు కొన్ని సన్నివేశాలను తొలగించామని తెలిపారు. గతేడాది డిసెంబర్లో సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తే వైఎస్సార్‌సీపీ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపారు.