Revanth Reddy Padayatra : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభలో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో మంగళవారం రాత్రి రేవంత్ రెడ్డి  బహిరంగ సభలో మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి వైపు దూసుకొచ్చారు. కాంగ్రెస్ సభవైపు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని దగ్గర్లోని థియేటర్ లో బంధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న థియేటర్ పై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఉద్రిక్తతల మధ్య రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  






"మా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. మందుకు అమ్ముడుపోయిన వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిచేస్తున్నారు. మీకు దమ్ముంటే, మీకు చేతనైనా నువ్వు రా బిడ్డా,  ఎవరినో పంపించి ఇక్కడ వేషాలు వేస్తున్నారు. నేను అనుకుంటే మీ థియేటర్ కాదు, మీ ఇళ్లు కూడా ఉండదు" అని రేవంత్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఫ్లెక్సీల వివాదం 
 
భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల ఘర్షణ ముదిరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇవాళ భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మొన్న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు  కడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేటీఆర్ పర్యటన ముగిసినా ప్లెక్సీలు ఎందుకని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి కటౌట్‌ను అడ్డుకోవడంతో అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త టవర్ ఎక్కాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. మొత్తానికి పోలీసులకు లాఠీచార్జ్ చేశారు.


పరకాల కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై రేవంత్ ఫైర్ 


 పరకాల నియోజకవర్గం పోరాటాల గడ్డ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పరకాల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గడ్డ పరకాల అన్నారు. అలాంటి ఈ గడ్డపై దళారులు, దండుపాళ్యం ముఠా కట్టి దోచుకుంటున్నాయని విమర్శించారు. ఇక్కడి ఎమ్మెల్యే పేరులోనే ధర్మం ఉంది కానీ ఆయన బుద్దిలో లేదన్నారు. ఈ ఎమ్మెల్యే  దందాల రెడ్డి సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. ఇక్కడ మొత్తం కాంట్రాక్టులు ధర్మా రెడ్డివే అని ఆరోపించారు. ఏ దోపిడీలో చూసినా ధర్మా రెడ్డి పేరే వినిపిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వలే, దళితులకు మూడెకరాలు ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. మరి 23 లక్షల కోట్లు ఎవరింటికి పోయినయ్ అని ప్రశ్నించారు. పరకాల అభివృద్ధి కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిందే అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు.