సీనియర్ నటి లయ సెకెండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఇండియాకు వచ్చారు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన లయ, ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ కు సంబంధించిన పలు విషయాల గురించి వివరించారు. గత కొంత కాలంగా కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా, వదులుకున్నట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్ సినిమాలో లయకు అవకాశం, కానీ..
నిజానికి జూనియర్ ఎన్టీఆర్, తివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ అనే సినిమా వచ్చింది. ఫ్యాక్షన్ బ్యాగ్రాఫ్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్మురేపింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అంతా ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో జగపతి బాబు నెగెటివ్ రోల్ చేశారు. బసిరెడ్డి పాత్రలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో అదిరిపోయే నటన కనబర్చారు. బసిరెడ్డి భార్య పాత్రలో ఈశ్వరీరావు అద్భుతంగా నటించారు. అయితే, ఈ క్యారెక్టర్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ ముందుగా లయను సంప్రదించారట. కానీ, అది చిన్న క్యారెక్టర్ అనుకుని నో చెప్పారట. దీంతో త్రివిక్రమ్ బసిరెడ్డి భార్య పాత్రకు ఈశ్వరీరావును ఎంపిక చేశారు. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ను వదులుకున్నందుకు చాలా బాధపడినట్లు చెప్పారు.
కథ వినకుండానే నో చెప్పా - లయ
“ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత’ సినిమాలో జగపతి బాబు భార్య క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. కానీ, కథ పూర్తిగా వినకుండానే నేను చేయలేను అని చెప్పాను. చిన్న క్యారెక్టర్ అనుకుని వదులుకున్నాను. కెరీర్ లో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. నేనూ అలాంటి పొరపాటే చేశాను. అనవసరంగా వదులుకున్నాను అని బాధపడ్డాను. జగపతి బాబు అప్పటితో పోల్చితే ఇప్పుడే బాగున్నారు. ఇదే విషయాన్ని ఆయనకు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు తన ఏజ్ కనిపించకుండా చక్కటి నటనతో ఆకట్టుకుంటున్నారు. ఆయన చేసే ప్రతిపాత్ర అద్భుతంగా ఉంటోంది” అని లయ వివరించారు. 2006లో పెళ్లి చేసుకున్న లయ ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. చివరిగా లయ తన కుమార్తెతో కలిసి ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో నటించారు.
Read Also: పేదరికమే ప్రదీప్ కుటుంబం చేసిన నేరం - వీధి కుక్కల ఘటనపై ఆర్జీవి ఆగ్రహం