Telangana News | హైదరాబాద్: రాష్ట్రంలో భూ పరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువస్తూ, వాటిని భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal)తో అనుసంధానం చేస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఆధునీకరించిన ఈ నూతన వ్యవస్థను వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
సీసీఎల్ఏ కార్యాలయ పనితీరుపై అసంతృప్తి నాంపల్లిలోని భూ పరిపాలన ప్రధాన కార్యాలయాన్ని (CCLA) మంత్రి పొంగులేటి సోమవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఆధునిక హంగులతో ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో తాను మళ్లీ తనిఖీ చేసే సమయానికి ఆఫీసులో స్పష్టమైన మార్పు కనిపించాలని హెచ్చరించారు. అలాగే, ప్రతి విభాగంపై వరుస సమీక్షలు నిర్వహిస్తామని, అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
పెండింగ్ కేసులు, రికార్డుల ప్రక్షాళనదశాబ్దాల క్రితం ప్రభుత్వం సేకరించిన భూములు ఇప్పటికీ రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేరిటే ఉండటంపై మంత్రి సీరియస్ అయ్యారు. వెంటనే భూ రికార్డులను సవరించాలని, అసైన్డ్ మరియు భూదాన్ భూములపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. వీటితో పాటు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల విజిలెన్స్ కేసులు మరియు కోర్టు కేసులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఒకే క్లిక్‌తో రైతులకు పూర్తి సమాచారంభూభారతి పోర్టల్ ద్వారా రైతులకు, సామాన్యులకు అవసరమైన అన్ని సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తెలిపారు. కేవలం ఒక్క క్లిక్‌తో ఏ వివరాలు మీకు కనిపిస్తాయంటే..
- భూముల పూర్తి సమాచారం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వివరాలు.- మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్‌కు సంబంధించిన మ్యాప్.- నాలా ఆర్డర్లు, ROR (Record of Rights), గ్రామాల నక్షా.
ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఈ సమాచారాన్ని పొందవచ్చని మంత్రి పొంగులేటి వివరించారు. భూ క్రయవిక్రయాల్లో ఇబ్బందులు కలగకుండా ప్రతి సర్వే నంబర్‌కు మ్యాప్ రూపొందించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
నూతన తహశీల్దార్ కార్యాలయాలకు మోడల్ డిజైన్రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహశీల్దార్ కార్యాలయాలన్నీ ఒకే రకమైన నమూనాలో ఉండాలని మంత్రి పొంగులేటి సూచించారు. రెవెన్యూ వ్యవస్థ ఆధునీకరణలో సామాన్యుడి ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని, సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ఎలాంటి తారుమారుకు లేదా లోపాలకు తావు లేకుండా అత్యంత పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.