KTR Bhainsa Road Show: నిర్మల్ జిల్లా భైంసాలో గురువారం (మే 9) సాయంత్రం కేటీఆర్ చేపట్టిన రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఅర్ కు వ్యతిరేకంగా హనుమాన్ దీక్షా పరులు నిరసన చేపట్టారు. ఇటీవలే ఓ సభలో కేటీఅర్ శ్రీరామ నామం అన్నం పెడుతుందా అన్న వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ వద్ద హనుమాన్ భక్తులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అక్కడ నుండి పంపించే ప్రయత్నం చేయగా హనుమాన్ స్వాములకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని పంపించాక రోడ్ షో కొనసాగింది.


కేటీఆర్ ప్రసంగిస్తుండగా నిరసన కారులు ఆయనపై టమాటాలు, ఆలు గడ్డలు విసిరారు. దీంతో కేటీఆర్ మాట్లాడుతూ.. పోలీసులు డ్యూటీలో లేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడి భక్తులు ఇలాగే ఉంటారా..? రాముడు మిమ్మల్ని రాళ్ళు రువ్వమని చెప్పాడా అంటూ ఎద్దేవా చేశారు. ఈ నిరసనల మద్యే కేటీఆర్ ప్రసంగం కొనసాగింది. ఆపై పోలీసులు కలుగజేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.


ఈ ఘటనపై కేటీఆర్ ఎక్స్ ద్వారా స్పందించారు. ‘‘బీజేపీ గూండాలు నాపై చేసిన రాళ్ల దాడి ఘటన తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. భైంసా రోడ్ షోలో జరిగిన ఘటనలో నాకు ఏమైనా జరిగిందేమో అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. నాకు ఏ గాయాలు అవ్వలేదు. చాలా బాగున్నాను. ఈ గూండాలపై పోరాటాన్ని కొనసాగిస్తాను’’ అని కేటీఆర్ పోస్ట్ చేశారు.