భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం చర్చగా మారిన సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. గౌరవ ప్రదమైన ప్రజాప్రతినిధిగా ఉన్న ఈమె తనకు తానుగా దేవతగా ప్రకటించుకుంది. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు పూజలు చేయడంతో ఆమె పూజల వ్యవహారం, పూజా కార్యక్రమాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. అయితే గతంలో విజయాలక్మి చేసిన డాన్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈమె స్వయం ప్రకటిత దేవతగా మారి భక్తుల నుంచి ఆశీస్సులు పొందుతుండడం, ఏకంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆమెకు నమస్కరించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.


ఆయన పూజలతోనే వెలుగులోకి..
తెలంగాణ హెల్డ్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండల ఎంపీపీ విజయలక్ష్మి తనకు తానే దేవతగా ప్రకటించుకోగా.. ఆమెతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యంగి మాతగా ప్రకటించుకుని క్షుద్రపూజల తరహాలో నిమ్మకాయలు, పసుపుతో పూజలు చేస్తూ వచ్చిన వారి కోరికలు నెరవేరుతాయని ఆమె నమ్మ బలుకుతున్నారు. ఈ విషయం ఎలా తెలిసి వెంటనే  కొత్తగూడెం వచ్చిన గడల శ్రీనివాసరావు ఆమె వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అంతే కాదు, ఎంపీపీ చుట్టు ప్రదక్షిణలు చేయడం, వింతగా కూర్చుని, చేతులతో రకరకాల ముద్రలు చూపుతున్న ఆమెకు నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.  


దేవుడు కరుణిస్తాడని సన్నితులకు చెబుతున్న డీహెచ్!
కరోనా సమయంలో  డీహెచ్ శ్రీనివాసరావు  ఎక్కువ బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చేవారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు కూడా ఉండటంతో ఆయనపై పలుమార్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా పదవిలోనే కొనసాగారు. ఇప్పుడు తనకు రాజకీయ ఆశలు ఉన్నాయని.. వాటిని నెరవేర్చుకోవాలన్న  లక్ష్యంతో ఇప్పుడు పూజల బాట పట్టారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన కొత్త గూడెంలో తరచూ పర్యటిస్తున్నారు. దేవుడు క‌రుణిస్తాడ‌ని తన సన్నిహితులకు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూఢ నమ్మకాలను నమ్మొద్దంటూ చెప్పాల్సిన హెల్త్ డైరెక్టర్.. ఇలా పూజలు చేయడం.. త‌న‌ను తాను దేవ‌త‌గా చెప్పుకుంటున్న మహిళ మాటలు వినడం, ఆమెకు పూజలు చేయడం, దేవతగా కొలవడం వంటివి చేయడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


అవి క్షుద్ర పూజలు కాదు గిరిజన పూజలు !
తాను క్షుద్ర పూజల్లో పాల్గొనలేదని డీహెచ్ క్లారిటీ ఇచ్చారు. అవి గిరిజన దేవతా ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానం తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు.  స్వయం ప్రకటిత  దేవత తో సంబంధం లేదన్నారు. మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనన్నారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. తన తండ్రి స్పూర్తితో జీఎస్సాఆర్​ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.  తాను రాజకీయాల్లోకి రావడం లేదన్నారు . ట్రస్ట్​ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేయించానని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.