Bhadrachalam: భద్రాచలం సీతారామ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అభిజిత్‌ లగ్నంలో అర్చకులు  కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, సత్యవతి రాఠోడ్‌, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రులు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అందజేశారు.


తొలుత ఉదయం 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం జరిపారు. అనంతరం మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి.. మిథిలా స్టేడియంలో పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన గావించారు. యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు జరుపుతారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. రేపు వైభవంగా శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.


కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. శ్రీరాముడి నినాదాలతో భద్రాద్రి మారుమోగింది. ఆలయ ప్రాంగణంతో పాటు భద్రాచలం వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. కరోనా పరిస్థితుల కారణంగా గత రెండేళ్లుగా స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించని సంగతి తెలిసిందే. ఆ కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులకు అనుమతి ఇవ్వలేదు. ఈ ఏడాది కరోనా బెడద లేకపోవడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తులకు పంపిణీ చేసేందుకు వీలుగా 2 లక్షల ప్యాకెట్ల స్వామి వారి తలంబ్రాలను అధికారులు సిద్ధం చేశారు.


నేడు భద్రాచలానికి గవర్నర్ తమిళిసై
నేడు శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ తమిళిసై భద్రాచలం సందర్శించనున్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా భద్రాద్రికి గవర్నర్, వీఐపీలు వస్తుడండంతో ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రేపు రామప్ప ఆలయాన్ని కూడా గవర్నర్ సందర్శిస్తారు. రెండ్రోజుల పాటు భద్రాచలంలోని మారుమూల మూడు గ్రామాలను గవర్నర్ తమిళిసై సందర్శించనున్నారు.


ఒంటిమిట్టలోనూ ఉత్సవాలు ప్రారంభం
ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. శ్రీ రామనవమి సందర్భంగా అంగరంగవైభవంగా ఓంటిమిట్ట కోదండరాముడి ద్వజారోహణ కార్యక్రమం వేద పండితులు నిర్వహించారు. వేద పండితుల మత్రోచ్చారణల నడుమ వైభవోపేతంగా వేడుక సాగింది. కేరళ వాయిద్యాలతో  ఆలయ ప్రాంగణం మార్మోగింది. టీటీడీ వాయిద్యాలతో సాగిన ద్వజారోహణ కార్యక్రమం,  వైభవోపేతంగా సాగిన వేడుకను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. రామ నామస్మరణలతో ఆలయ ప్రాగణం మార్మోగింది. స్వామి వారికి ప్రభుత్వం తరపున రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.