Anantapur Old Man Studies: మానవుడు నిత్య విద్యార్థి. ఎంత తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా మిగిలే ఉంటుందంటారు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. కొత్త విషయాల పట్ల కుతూహలం, ఆసక్తి ఉన్నవారు దీన్ని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలోనే అబ్దుల్ కలాం మాటలను అక్షరాలా వంట పట్టించుకున్నట్లు ఉన్నారు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి. అనంతపురంలో నివాసం ఉంటున్న ఈయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో సేవలు అందించారు. 2018లో పదవి విరమణ పొందారు. డిప్లొమో ఆధారంగా ఈయనకు అప్పట్లో ఆ ఉద్యోగం వచ్చింది. కానీ ఉన్నత చదువులు  అభ్యసించాలన్న ఆయన కోరికకు ఉద్యోగంతో బ్రేక్ పడినట్లు అయింది. 


అయినా ఆయన అక్కడితో ఆగిపోలేదు. నిరుత్సాహ పడలేదు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలు.. మరోవైపు కుటుంబ పోషణ బాధ్యత చూస్తూనే తన ఉన్నత చదువుల కోరిక తీర్చుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. జేఎన్టీయూలో నైట్ కాలేజీలో క్లాసులకు హాజరు అవుతూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఎంటెక్ కూడా జాయిన్ అయ్యారు. అయితే, థీసిస్ పూర్తికాని కారణంగా ఎంటెక్ అసంపూర్తిగానే మిగిలిపోయింది. 


2018లో ఆయన పదవీ విరమణ పొందారు. సాధారణంగా పదవీ విరమణ పొందిన తర్వాత ఆ వయసులో రామా.. కృష్ణా అంటూ మనవళ్లు మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ, ఈయన తీరు వేరు. అందరిలాగా సత్యనారాయణ రెడ్డి అలా ఒకే చోట కూర్చుండిపోలేదు. 2021లో ఎంటెక్ పూర్తి చేశాడు. జియోమాటికల్ ఇంజినీరింగ్ తనకు సూట్ అవుతుందని భావించిన ఈయన గేట్ ప్రవేశ పరీక్షకు కూడా సిద్ధం అయ్యారు. ఆ తర్వాత మొదటి ప్రయత్నం లోనే 140వ ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. 


తన భార్య, కొడుకులు, కోడళ్ళు కుటుంబ సభ్యులు అందరూ సహకరించ బట్టే ఈ వయసులో తాను ఇలా ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసి, పట్టా పొందగలిగానని సత్యనారాయణ రెడ్డి ఆనందంగా చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఐఐటీలో ఏ క్యాంపస్ ఎంపిక చేసుకోవాలనే నిర్ణయానికి వస్తానని చెబుతున్నారు. చుట్టుపక్కల చిన్న పిల్లలు కూడా ఆల్ ది తాతయ్య గారు అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Also Read: AP New Cabinet: ఏపీ నూతన కేబినెట్‌పై ఉత్కంఠ! జిల్లాలవారీగా కొత్త మంత్రుల ఫైనల్ లిస్టు ఇదే?


Also Read: Mekapati Gautham Reddy: రాజకీయాల్లోకి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, ఉప ఎన్నికల్లో పోటీకి సై!